మధుకు 'మహాత్మ' రైట్స్
హింసతో ఏదైనా సాధించవచ్చని నమ్మే ఓ యువకుడు ఒకానొక సందర్భంలో అహింసా మంత్రాన్ని జపించి గాంధీజీ ఆశయాల సాధనకు నడుం బిగించే కథాశంతో రూపొందిన చిత్రం 'మహాత్మ'. హీరో శ్రీకాంత్ నటిస్తున్న 100వ చిత్రమిది. 'ఖడ్గం' చిత్రంతో శ్రీకాంత్ కు మాస్ ఫాలోయింగ్ తెచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రతిష్ఠాతకంగా ఈ చిత్రం తెరకెక్కింది. గోల్డెన్ లయెన్స్ పతాకంపై సి.ఆర్.మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం బిజినెస్ కూడా పూర్తయింది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ హక్కులను 'ఠాగూర్' మధు సొంతం చేసుకున్నారు. చిరంజీవితో 'ఠాగూర్' చిత్రాన్ని నిర్మించిన మధు ఆ తర్వాత 'స్టాలిన్', హిందీ 'గజనీ' చిత్రాలకు సహనిర్మాతగా వ్యవహరించారు.
మరోవైపు 'మహాత్మ' చిత్రం ఆడియోను ఈనెల 21న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. మహాత్మాగాంధీ మనువడు తుషార్ గాంధీ చేతుల మీదుగా ఆడియో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రోశయ్య, పి.ఆర్.పి.ఆధినేత చిరంజీవి, పలువురు సినీ ప్రముఖులు సైతం హాజరు కానున్నారు. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రచన, సిరివెన్నెల-సుద్దాల అశోక్ తేజ-లక్ష్మీభూపాల్ పాటలు, శరత్ సినిమాటగ్రఫీ, శంకర్ ఎడిటింగ్, విజయ్ ఆంటోని సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|