ఇక్కడ చైతన్య..అక్కడ శింబు
అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడోతరం వారసుడుగా 'జోష్' చిత్రంతో ఈమధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్య కొద్దిరోజుల క్రితమే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రెండో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై మంజుల, సంజయ్ స్వరూప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వ ప్రతిభపై అపార నమ్మకం ఉన్న నాగార్జున సైతం ఆయనను ఒప్పించి ఈ ప్రాజెక్ట్ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఆసక్తికరంగా ఈ చిత్రం ఇప్పటికే తమిళంలో శింబు, త్రిష జంటగా 'విన్నతాండి వరువాయ' పేరుతో గౌతమ్ మీనన్ దర్శకత్వంలోనే రూపొందుతోంది. షూటింగ్ దాదాపు ఫినిషింగ్ స్టేజ్ లో కూడా ఉంది. ఆ చిత్రం రిలీజ్ కు ముందే దానిని తెలుగులో నాగచైతన్యతో రీమేక్ చేస్తుండటం విశేషం.
యువతను ఆకట్టుకునే రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్ర ఇతివృత్తం ఉంటుంది. సంగీతానికి మంచి ప్రాధాన్యం ఉండటంతో రెండు వెర్షన్లలోనూ ఇళయరాజాను ఎంచుకున్నారు. తెలుగు వెర్షన్ కోసం కొత్త హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. హైద్రాబాద్, కేరళ, న్యూయార్క్ లలో షూటింగ్ జరుపనున్నారు. తమిళ, తెలుగు వెర్షన్లలో ఏకకాలంలో ఇదే డిసెంబర్ లో సినిమా విడుదలవుతుంది.
Be first to comment on this News / Article!
|