ప్రేమలో 'ప్రవరాఖ్యుడు'
పరిణతి చెందిన ప్రేమకథా ఇతివృత్తంతో ప్రేమ భావోద్వేగాల సమాహారంగా 'ప్రవరాఖ్యుడు' చిత్రం రూపొందుతోంది. జగపతిబాబు-ప్రియమణి జంటగా టాలీ టు హాలీ ఫిలిమ్స్ పతాకంపై గణేష్ ఇందుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మదన్ ('పెళ్లైన కొత్తలో' ఫేమ్) దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ హైద్రాబాద్ లో శరవేగంగా జరుగుతోంది.
చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ, ఈనెల 6 నుంచి మొదలైన చివరి షెడ్యూల్ అక్టోబర్ నెలాఖరు వరకూ జరుగుతుందని, దీంతో షూటింగ్ పూర్తవుతుందనీ చెప్పారు. నవంబర్ లో ఆడియోను, డిసెంబర్ లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. కొత్తగా అనిపించే పరిణతి చెందిన ప్రేమకథ ఇదని మదన్ తెలిపారు. జగపతిబాబు, ప్రియమణి జంట అభినయం ఎంతగానో అలరిస్తుందనీ, కీరవాణి సంగీత ప్రతి ఒక్కరి మనసులను తాకుతుందనీ చెప్పారు. వైవిధ్యమైన కథా కథనాలతో రెండున్నర గంటల సేపు ప్రేక్షకులను ఆనందజింపజేసేలా ఈ చిత్రం ఉంటుందన్నారు. ఆగస్టులో 15 రోజుల పాటు దక్షిణాఫ్రికాలో చేసిన షూటింగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. అక్కడి ఫారెస్ట్ లో చిత్రీకరించిన సన్నివేశాలు, రాజు సుందరం నృత్య దర్శకత్వంలో జగపతిబాబు, ప్రియమణిపై చిత్రీకరించిన రెండు పాటలు ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ఆలీ, సునీల్, ధర్మవరపు, చలపతిరావు, సివిఎల్, రాజ్యలక్ష్మి, హంసనందిని, మధుశర్మ, అనితానాథ్ తదితరులు నటిస్తున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం మదన్ అందిస్తున్న ఈ చిత్రానికి చైతన్యప్రసాద్ పాటలు, సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్, ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|