ధర్మవరపు లేటు వయసులో..
ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రమణ్యం ఇప్పుడు హీరో కూడా అయ్యారు. కమెడియన్లు హీరోలు కావడం కొత్త కాకపోయినా ఒకింత లేటు వయసులోనే ధర్మవరపు కథానాయకుడి అవతారం ఎత్తారు. అందుకు తగ్గట్టే ఈ చిత్రంలోనూ ఆయన కెరీర్ లో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కలిగిన వ్యక్తి పాత్రను పోషిస్తున్నారు. ధర్మవరపు సరసన ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. రాజా ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రాజా నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. రామ్ కుమార్ దర్శకుడు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
శ్రీశైలం, వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ పూర్తి చేశామనీ, మరోవైపు వందేమాతరం శ్రీనివాస్ సంగీత సారథ్యంలో మ్యూజిక్ సిట్టంగ్ జరుగుతోందనీ నిర్మాత రాజా తెలిపారు. శనివారంనాడు ధర్మవరపు పుట్టినరోజు అనీ, హీరోగా ఈ తొలి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామనీ అన్నారు. రామ్ కుమార్ మాట్లాడుతూ, తొలి షెడ్యూల్ లో నాయకానాయికలతో పాటు సీనియర్ హాస్య తారాగణంపై కామెడీ సన్నివేశాలు, హీరోయిన్ కీలక సన్నివేశాలు చిత్రీకరించామని అన్నారు. కెరీర్ లో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకునే ఆలోచన ఉన్న కథానాయకుడి జీవితం ఎంలాంటి మలుపులు తిరిగిందనేది వినోదాత్మక ఇందులో చూపిస్తున్నామని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణ భగవాన్, ఏవీయస్, జీవా, ఎల్బీ శ్రీరాం, సూర్య, అలెక్స్, అశోక్ కుమార్, దువ్వాసి మోహన్, గుండు హనుమంతరావు, విశ్వేశ్వరరావు, కల్యాణి తదితరులు నటిస్తున్నారు. దీపికారాజు మాటలు, పైడాల శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ, నందు ఫైట్స్, రమేష్ ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|