సూర్య 'ఘటికుడు'
'గజనీ', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్', 'వీడొక్కడే' వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సూర్య తాజాగా 'ఆదవన్' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు స్టాలిన్ 42 కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యకు జోడిగా నయనతార నటిస్తోంది. ఈ చిత్రాన్ని సిఎన్ ఆర్ క్రియేషన్స్ సంస్థ తెలుగులో 'ఘటికుడు' పేరుతో విడుదల చేయనుంది. తెలుగు హక్కులను నిర్మాత, వ్యాపారవేత్త, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్ పొందారు.
చిత్ర విశేషాలను చందన రమేష్ తెలుపుతూ, సూర్య ఇందులో వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నారనీ, 12 ఏళ్ల కుర్రాడుగా కూడా కనిపించబోతుండటం విశేషమనీ చెప్పారు. ఈ చిత్రానికి 25 మంది ఫైట్ మాస్టర్లు పనిచేశారనీ, ముఖ్యంగా కలకత్తాలో ఇంట్రడక్షన్ ఛేజ్ సినిమాకి ప్రత్యేక హైలైట్ గా ఉంటుందనీ తెలిపారు. ఫ్యాన్స్ కు చెందిన ఫైట్ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ ఛేజ్ తీశారని చెప్పారు. క్లయిమాక్స్ దక్షిణాఫ్రికాలో 5 కోట్ల భారీ వ్యయంతో తీశారని, అలనాటి కథానాయిక బి.సరోజాదేవి సుమారు 20 ఏళ్ల తర్వాత ఈ చిత్రంలో సూర్యకు తల్లి పాత్రను పోషించడం విశేషమనీ చెప్పారు. కలకత్తా నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని చిత్ర సమర్పకుడు చందన నాగేశ్వర్ తెలిపారు. హారిస్ జైరాస్ సంగీతం అందర్నీ అలరిస్తుందనీ, ఈ నెలాఖరులో ఆడియో, అక్టోబర్ లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామనీ తెలిపారు. ఈ చిత్రానికి రమేష్ ఖన్నా కథ, శ్రీరామకృష్ణ మాటలు, భువన చంద్ర పాటలు, రాంగణేష్ సినిమాటోగ్రఫీ అందించారు.
Be first to comment on this News / Article!
|