గద్దె సింధూరకు కొత్త ఆఫర్లు
గద్దె సింధూర గుర్తుంది కదూ. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2005 కిరీటాన్ని దక్కించుకున్న పదహారణాల తెలుగు అమ్మాయి. బెజవాడ ముద్దుగుమ్మ గద్దె సింధూర తొలిసారిగా రసూల్ ఎల్లోర్ దర్శకత్వంలో రూపొందిన 'సంగమం' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ చిత్రం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిపోయిందో తెలియనంతగా బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూసింది. ఈమధ్యనే 'హే బేబీ' అనే హిందీ చిత్రంలోనూ ఆమె నటించింది. ఇటీవల మళ్లీ టాలీవుడ్ కు తిరిగొచ్చిన ఆమె ఫిల్మ్ ఫేర్ ఫంక్షన్ లో యాంకర్ గా వ్యవహరించి అందరి దృష్టినీ ఆక్టటుకుంది. తాజాగా ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం భూమిక, స్నేహ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'అమరావతి' చిత్రంలో పోలీసు ఆఫీసర్ పాత్రను గద్దె సింధూర పోషిస్తోంది. అల్లరి రవిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా మరో ఆఫర్ గద్దె తలుపు తట్టింది. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం కావడం విశేషం. శ్రీనివాస్ క్రియేషన్స్ పతాకంపై సి.హెచ్.ఆర్.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'శ్రీ సత్యనారాయణ స్వామి' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన నగేష్ నారదాసి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిదనీ, అక్టోబర్ 9 నుంచి తలకోన, తిరుపతి, చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ జరుపుతామనీ నిర్మాత తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో తనికెళ్ల భరణి, సాయికుమార్, జీవా, విజయ్ తదితరులు నటించనున్నారు. మధు ఎ నాయుడు సినిమాటోగ్రఫీ, సాయి కార్తీక్ సంగీతం అందించనున్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|