ప్రియమణి 'ప్రియతమా రావే'
'ద్రోణ', 'మిత్రుడు' చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ప్రియమణి ఇప్పుడు జగపతిబాబుతో 'ప్రవరాఖ్యుడు' చిత్రంలో నటిస్తోంది. జగపతిబాబుతోనే మరో కొత్త చిత్రానికి కూడా కమిట్ అయింది. ప్రియమణికి ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని తమిళంలో ప్రియమణి కథానాయికగా నటించిన 'మధు' చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి అనువదించి విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి 'ప్రియతమా..రావే' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రభాత్ సెల్యులాయెడ్ పతాకంపై బొండా వెంకట స్వామి నాయుడు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.
సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు రమేష్, ప్రియమణి జంటగా దిన అరసు దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ఈ చిత్రం చక్కటి విజయం సాధించిందనీ, తెలుగు ప్రేక్షకులను కూడా అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుందనీ నిర్మాత తెలిపారు. ఇదొక అందమైన ప్రేమ కథ. ఇందులో కథానాయకుడు ఊటీలోని లేడీస్ హాస్టల్ లో ఉంటున్న ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ప్రేమకి ఆమడదూరంలో ఉండే ఆ యువతి మనసును కూడా దోచుకుంటాడు. ఆ తర్వాత క్రమంలో కసాయి మనస్తత్వం ఉన్న ప్రేయసి తండ్రిని ఎదుర్కోవలసి వస్తుంది. ఆ క్రమంలో అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, తన ప్రేమను ఏవిధంగా గెలిపించుకున్నాడన్నదే ఈ చిత్రకథ అని ఆయన తెలిపారు. ఇళయరాజా అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక అకర్షణగా నిలుస్తుందన్నారు. డబ్బింగ్, సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తయ్యాయనీ, అక్టోబర్ మొదటివారంలో సినిమా విడుదల చేస్తామనీ చెప్పారు.
Be first to comment on this News / Article!
|