35 లక్షలతో 'కబడ్డీ' సెట్
'సుస్వాగతం' చిత్రం నుంచి నిన్నమొన్నటి 'గోరింటాకు' వరకు అనేక ఉత్తమ కుటుంబ కథా చిత్రాలను అందించిన సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ తాజాగా మెగా సూపర్ గుడ్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై 'భీమిలి కబడ్డీ జట్టు' అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాతినేని సత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నాని, శరణ్య మోహన్, కిషోర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం కోసం 35 లక్షల రూపాయల వ్యయంతో కబడ్డీ సెట్ వేసి సోమవారం నుంచి మరో షెడ్యూల్ జరుపుతున్నట్టు చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.
దర్శకుడు సత్య మాట్లాడుతూ, కథే ప్రధానంగా నూతన నటులు, సాంకేతిక నిపుణులను పలువురిని పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెకిస్తున్నామనీ, ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రం రూపొందుతోందనీ చెప్పారు. ఈ చిత్రం కోసం సారధి స్టూడియోస్ లో భారీ ఖర్చుతో కబడ్డీ సెట్ వేసి రెండో షెడ్యూల్ చేస్తున్నామని చెప్పారు. ఆగస్టు 1 నుంచి ఈనెల 20 వరకూ తొలి షెడ్యూల్ పూర్తయిందనీ, వెంటనే 21 నుంచి రెండో షెడ్యూల్ మొదలుపెట్టామనీ చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుందని ఆర్.బి.చౌదరి తెలిపారు. ఎక్కడా రాజీ పడకుండా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు పరాస్ జైన్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సురేంద్రన్ కథ, చిట్టిబాబు సినిమాటోగ్రఫీ, నందమూరి హరి ఎడిటింగ్, సెల్వ గణేష్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|