'ఈనాడు' డిస్ట్రిబ్యూటర్ ఔదార్యం
రెండేళ్ల క్రితం హైద్రాబాద్ లోని లుంబీనీ పార్క్, గోకుల్ ఛాట్ ప్రాంతాల్లో తీవ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్లలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఆనాటి దుర్ఘటనలో బాధితులైన కుటుంబాలకు 'ఈనాడు' ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ జి.కుమార్ బాబు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఉగ్రవాదం వల్ల సామాన్య ప్రజానీకం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటోందనే ఇతివృత్తంతో చక్రి తోలేటి దర్శకత్వంలో కమల్ హాసన్, వెంకటేష్ ప్రధాన పాత్రధారులుగా నటించిన 'ఈనాడు' చిత్రం గత వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని జి.కుమార్ బాబు ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ చేశారు. హైద్రాబాద్ లోని ఫిలిం చాంబర్ లో చిత్రయూనిట్ సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు చెందిన ఆరుగురికి తలో 10 వేల రూపాయలు చొప్పున కుమార్ బాబు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దర్శకుడు చక్రి, నటుడు భరత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు చెందిన శంకర్, అంజయ్య, చంద్రశేఖర్ రావు, జె.నర్సింహ శర్మ, జి.శ్రీనివాసరెడ్డి, సిద్ధిరాములు ఈ ఆర్థిక సహాయాన్ని అందుకున్నారు. ఉగ్రవాదం సామాన్య మానవుని జీవితాలను ఎలా అతలాకుతలం చేస్తోందో వివరిస్తూ తీసిన 'ఈనాడు' చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని కుమార్ బాబు తెలిపారు. మంచి కాన్సెప్ట్ కావడంతో తాము తెలుగు వెర్షన్ కు తీసుకున్నామని అన్నారు. హైద్రాబాద్ పేలుళ్ల సంఘటనలో బాధితులైన కుటుంబాలకు సహాయం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. దీనిపై బాధితులు స్పందిస్తూ, ఉగ్రవాదం వల్ల తమ కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయనీ, ఇందువల్ల తలెత్తే దుష్పరిణామాలను వివరిస్తూ చక్కటి సందేశాత్మక చిత్రంగా 'ఈనాడు' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిందనీ, ఇలాంటి మంచి ప్రయత్నం చేసిన దర్శకనిర్మాతలు, నట నటీనటులందరికీ తమ అభినందనలనీ అన్నారు.
Be first to comment on this News / Article!
|