నటి ఎస్.వరలక్ష్మి కన్నుమూత
సీనియర్ నటి, నేపథ్య గాయని ఎస్.వరలక్ష్మి మంగళవారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. ఆమె వయసు 82 ఏళ్లు. సుమారు ఆరు నెలల క్రితం ప్రమాదవశాత్తు కిందపడటంతో వెన్నుకు గాయమైంది. ఆరోగ్యం బాగా క్షీణించడంతో రెండు రోజుల క్రితం ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ రాత్రి 8 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని జగ్గంపేటలో 1927 ఆగస్టు 13న ఎస్.వరలక్ష్మి జన్మించారు. తొమ్మిదో ఏట బాలనటిగా 'బాలయోగిని ' అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత చెన్నై వచ్చిన ఆమె అక్కినేని నాగేశ్వరరావుతో 'బాలరాజు' సినిమాలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన పాత్రకు తానే పాటలు పాడుకునే వారు. తెలుగు, తమిళ చిత్రాల్లో పలువురు అగ్రహీరోల సరసన ఆమె నటించారు. 'సత్యహరిశ్చంద్ర'లో చంద్రమతిగా, 'లవకుశ'లో భూదేవిగా, 'వీరపాండ్య కట్టబొమ్మన్'లో శివాజీ గణేష్ సరసన నటించిన పాత్రలు ఇప్పటికీ గుర్తిండిపోతాయి. తెలుగులో 'రైతుబిడ్డ' (1939), 'మాయాలోకం' (1945), 'పల్నాటి యుద్ధం' (1947), 'స్వప్నసుందరి' (1950), 'సతీ సక్కుబాయి' (1954), 'శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం' (1960), 'శ్రీ కృష్ణార్జున యుద్ధం' (1963), ప్రేమ్ నగర్ (1971), బాలభారతం (1972), 'ముద్దుల కృష్ణయ్య', తమిళంలో 'పూవా తలైయ', 'సవాలే సమాలి', 'మాట్టుక్కార వేలన్', 'నీదిక్క తలైవణంగు' వంటి చిత్రాలు ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ప్రముఖ నిర్మాత ఎఎల్ శ్రీనివాసును ఆమె పెళ్లాడారు. ఆ తర్వాత కూడా ఆమె పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ పోషించారు. తమిళనాడు ప్రభుత్వం ఆమెను 'కవిజ్ఞర్ కన్నదాసన్', 'కలైమామణి' అవార్డులతో సత్కరించింది. శివాజీ గణేషన్ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన శివాజి గణేషన్ స్మారక అవార్డును కూడా అందుకున్నారు. చివరిసారిగా ఆమె కమల్ హాసన్ 'గుణ' చిత్రంలో నటించారు. ఎస్.వరలక్ష్మి మృతితో అలనాటి తరానికి ఒక మంచి నటగాయనిని పరిశ్రమ కోల్పోయింది.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|