మేఘనానాయడు పెళ్లి...
గ్లామర్ గాళ్ మేఘనా నాయడు పంజాబీ యువకుడైన కుశాల్ ను పెళ్లాడబోతోంది. ఈమధ్యనే ఇద్దరికీ నిశ్చితార్ధం కూడా జరిగింది. అయితే పెళ్లికి మాత్రం మరి కొద్ది సమయం పడుతుందట. మేఘన మన తెలుగుమ్మాయి కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన మేఘన తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులకు సుపరిచితురాలు. 'భామాకలాపం'లో కీలక పాత్ర పోషించిన మేఘన 'విక్రమార్కుడు', 'ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే' , 'పాండురంగడు' చిత్రాల్లో ఐటెం సాంగ్స్ తో అలరించింది. ఇటీవలే 'కలియోం కా చమన్' మ్యూజిక్ వీడియో ఆమెకు మంచి పేరు తెచ్చింది.
కుశాల్ ను త్వరలోనే మేఘన పెళ్లిచేసుకోనుందంటూ ఇటీవల వస్తున్న వార్తలపై మేఘన స్పందిస్తూ 'చాలాకాలంగా కుశాల్, నేనూ మంచి స్నేహితులం. ఒకరి పట్ల మరొకరి ఆరాధనా భావం ఉండేది. అలా ప్రేమలో పడ్డాం. దాదాపు ఇద్దరి అభిరుచులూ ఒకటే. ఐదారు నెలల క్రితం నిశ్చితార్ధం కూడా జరిగింది. ప్రస్తుతం కుశాల్ బ్యాంకాక్ లోనూ, నేను ముంబైలోనూ బిజీగా ఉన్నాం. వచ్చే ఫిబ్రవరిలో మ్యారేజ్ ఉండబోతోందనే వార్తల్లో మాత్రం నిజం లేదు. ఇంకా తేదీ ఖరారు కాలేదు' అని మేఘన చెప్పుకొచ్చింది. కెరీర్ లో నటించిన పాత్రలు, వచ్చిన సెక్సీ ఇమేజ్ కు తాను పూర్తి భిన్నమైన వ్యక్తిననీ, మధ్యతరగతి నుంచి వచ్చిన తాను ఎన్నో ఎత్తుపల్లాలు చూశాననీ, బేసిక్స్ ఎప్పుడూ మరిచిపోననీ అన్నారు. తెరపై సెక్సీగా కనిపించాల్సి వచ్చినా నిజజీవితంలో తాను ఎంతో సింపుల్ గా ఉండటానికే ఇష్టపడతానని తెలిపారు. హీరోయిన్లకు పెళ్లయిన తర్వాత అవకాశాలు తగ్గిపోతాయనే వాదనలో పస లేదనీ, టీవీల్లో నటిస్తున్న వారిలో ఎక్కువ మంది పెళ్లయిన వారనీ, వారికి ప్రేక్షకుల ఆదరణతో పాటు అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయనీ అన్నారు. నటీమణుల వ్యక్తిగత జీవితానికి వివాహం ఎంతమాత్రం అడ్డంకి కాదంటూ పెళ్లి తర్వాత కూడా నటన కొనసాగిస్తానననే అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పింది మేఘన.
Be first to comment on this News / Article!
|