నితిన్ రెచ్చిపోతాడా?
ఒకటా రెండా దాదాపు అరడజను ఫ్లాపులు. ప్రయత్న లోపం లేదు. అయినా లక్ మాత్రం ముఖం చాటేస్తూనే ఉంది. ఎయిట్ ప్యాక్ చేసిన మొదటి హీరో కూడా ఆయనే. అయినా ఫ్యాక్డ్ హౌసెస్ మూవీగా ఒక్కటీ నిలబడటం లేదు. తొలి నాళ్లలో 'జయం', 'దిల్', 'సై' వంటి హిట్లు సొంతం చేసుకుని ఆ తర్వాత సక్సెస్ కోసం తపించి పోతున్న ఆ యువహీరో నితిన్ అని తేలిగ్గానే ఊహించేయవచ్చు. 'టక్కరి', 'హీరో', 'విక్టరీ' 'ద్రోణ' వంటి వరుస ఫ్లాపుల తర్వాత ఈమధ్యనే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'అడవి' చిత్రంలో నటించినప్పటికీ అది కూడా అదే బాట పట్టింది. సహజంగా ఫ్లాపుల తర్వాత అవకాశాలు తగ్గడం సహజమే అయినా నితిన్ కు అవకాశాలు మాత్రం తగ్గలేదు. అందులో భాగంగానే ఇప్పుడు 'రెచ్చిపో'తానంటూ ఈ శుక్రవారమే ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ 'దొంగ' పాత్రలో (మంచిదొంగ) నటించారు. ఇంతవరకూ తాను ఇలాంటి పాత్ర చేయలేదనీ, ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన చిత్రమిదనీ నితిన్ చెబుతున్నారు. అందులోనూ 'జల్సా', 'కిక్' వంటి వరుస హిట్లతో ప్రేక్షకుల హృదయ సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఇలియానా తొలిసారి తనతో నటిస్తుండటంతో 'లేడీ లక్' కూడా కలిసొస్తుందనే గట్టి నమ్మకంతోనూ ఉన్నారు. నిజానికి 'దేవదాసు' కంటే ముందే నితిన్ తో ఇలియానా నటించాల్సి ఉందట. కారణాంతరాల వల్ల అది వర్కవుట్ కాలేదు. ఇలియానా కెరీర్ కు మాత్రం 'దేవదాసు' గుడ్ బిగినింగ్ అయింది. ప్రస్తుతం ఫ్లాపుల పరంపరలో ఉన్న నితిన్ కు ఇలియానా సాహచర్యమైన కలిసి వస్తుందా లేదా అనేది శుక్రవారం తేలుతుంది.
Be first to comment on this News / Article!
|