యంగ్ ఇండియాకు బాలు గానం
దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ దర్శకపగ్గాలు చేపట్టబోతున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల నిర్మాతగా మాత్రమే కొనసాగుతూ వచ్చిన దాసరి ఇటీవల 'మేస్త్రి' చిత్రానికి గాను ముఖానికి మేకప్ వేసుకున్నారు. ఇప్పుడు దాసరి మళ్లీ ఉత్సాహంతో మెగాఫోన్ పట్టుకోనుంటున్నారు. 'యంగ్ ఇండియా' పేరుతో అంతా కొత్తవారిని పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని ఆయన తెరెకెక్కించనున్నారు. ఇది దర్శకుడిగా దాసరి 149వ చిత్రం. శ్రీమతి దాసరి పద్మ సమర్పణలో సిరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రామకృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సబంధించిన నాలుగు పాటలను పద్మశ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణం పాడగా రికార్డ్ చేశారు.
దాసరి ఆ విషయం తెలియజేస్తూ, అంతా కొత్త వారితో అన్ని తరగతుల వారికి నచ్చే కథాంశంతో ఈ కథ తయారు చేశామనీ, స్టార్ కాస్ట్ కోసం పిలుపు ఇవ్వగానే వేలాది అప్లికేషన్లు వచ్చాయనీ, కొంత మందిని ఎంపిక చేశామనీ చెప్పారు. వారికి నెల రోజుల శిక్షణ కూడా ఇస్తున్నట్టు చెప్పారు. ఇదే సమయంలో కీరవాణి తో కలిసి తాను సంగీత చర్చల్లో పాల్గొని పాటలను ఫైనలైజ్ చేశాననీ, ఎస్.పి.బాలసుబ్రమణ్యం చేత నాలుగు పాటలు పాడించామనీ చెప్పారు. ఇందులోని పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపించేలా మంచి సాహిత్యపు విలువలతో ఉన్నాయని బాలు సంతోషం వ్యక్తం చేశారనీ, ఈ నెలాఖరుల కల్లా మొత్తం పాటల రికార్డింగ్ పూర్తవుతుందనీ చెప్పారు. త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తెస్తామని తెలిపారు.
Be first to comment on this News / Article!
|