సూర్యకిరణ్-కల్యాణి 'చాప్టర్ 6'
'సత్యం', 'ధన 51', 'రాజుభాయ్' చిత్రాల దర్శకుడు సూర్యకిరణ్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి 'చాప్టర్ 6' అనే టైటిల్ ఖరారు చేశారు. మిడాస్ టచ్ పతకాంపై సూర్యకిరణ్ భార్య, నటి కల్యాణి ఈ చిత్రాన్ని తొలిసారి నిర్మిస్తున్నారు. కల్యాణి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా బాల, సోనియా సూరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. తొలిసారి ఆ చిత్ర విశేషాలను సూర్యకిరణ్, కల్యాణి తెలియజేశారు.
కథ బాగా నచ్చి నిర్మాతగా మారాననీ, తొలిసారి తన భర్త దర్శకత్వంలో పనిచేస్తున్న సినిమా ఇదనీ కల్యాణి తెలిపారు. సినిమా చూస్తుంటే ఓ అందమైన నవల చదువుతున్న అనుభూతి కలుగుతుందన్నారు. ప్రేమలోని ఆరు రకాల భావోద్వేగాలను చూపుతూ ఆద్యంతం ఆసక్తికరంగా ఈ చిత్రం రూపొందుతోందన్నారు. సూర్యకిరణ్ మాట్లాడుతూ, ఫ్రిబ్రవరి 14న ప్రేమికుల రోజున సినిమా షూటిగ్ ప్రారంభించి హైద్రాబాద్, వైజాగ్, చెన్నై, మేఘాలయ, సిక్కిం, కేరళ, థాయ్ లాండ్ లలో చిత్రీకరణ జరిపామని చెప్పారు. జూలై 6తో షూటింగ్ పూర్తయిందన్నారు. ప్రేమ పుట్టుకను నీలిరింగులో, ప్రేమలోని పవిత్రతను తెలుపురంగులో, ప్రేమలోని వైరుధ్యాన్ని నలుపు రంగులో, బాధను లేత పసుపు రంగులో, ప్రేమాన్వేషణను నారింజ రంగులో, ప్రేమ విజయాన్ని ఎరుపు రంగులో వర్ణిస్తూ ఈ చిత్రం ఉంటుందన్నారు. ఇందులో 8 పాటలుంటాయనీ, ఒక్కో పాటను ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ ఆలపించడం విశేషమనీ, పి.సి.శివన్-మేహన్ సితార సంగీతం అందిస్తున్నారనీ చెప్పారు. దేవీశ్రీప్రసాద్, ఆర్.పి.పట్నాయక్, చక్రి, శ్లీలేఖ, జెస్సీ గిఫ్ట్, పి.సి.శివన్, మోహన్ సితార, హరిహరన్ ల చేత పాటలు పాడించామన్నారు. ఇందులో ప్రతి సన్నివేశాన్ని నాలుగు కెమెరాలతో నలుగురు కెమెరామెన్లు - ఎ.ఎన్.రాజా, సెల్వకుమార్, చిత్రె సెల్వన్, నిర్మల్ రాజా చిత్రీకరించారని తెలిపారు. ప్రస్తుతం డిటిఎస్ కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, ఈ వారంలోనే ఆడియో, అక్టోబర్ లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామనీ చెప్పారు. ఈ చిత్రానికి భాస్కర భట్ల, రామజోగయ్య శాస్త్రి, కందికొండ, కృష్ణ చైతన్య సాహిత్యం సమకూర్చారు.
Be first to comment on this News / Article!
|