'లవకుశ' ది వారియర్ ట్విన్స్
రామాయణం ఓ రమణీయ దృశ్య కావ్యం. శ్రీరామచంద్రుని ఎదిరించిన లవకుశులు ధీరత్వానికి ప్రతీకలుగా నిలిచారు. రామాయణంలోని ఆసక్తకరమైన ఈ ఘట్టాన్ని ఇతివృత్తంగా తీసుకుని రూపొందుతున్న 2డి యానిమేషన్ చిత్రం 'లవకుశ' (ది వారియర్ ట్విన్స్). ఆర్ విఎంఎల్ యానిమేషన్, ది కాణిపాకం క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. క్రియేటర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రాయుడు వి.శశాంక్ ఆవి వివరాలను తెలియజేశారు.
తొలుత 2006లో ఈ చిత్ర నిర్మాణాన్ని ప్రకటించామనీ, పక్కాగా స్క్రిప్టు రెడీ చేయడానికి ఏడాది పట్టిందనీ, ప్రతిభావంతులైన నిపుణులతో వర్క్ చేయించడానికి మరో రెండేళ్లు పట్టిందనీ చెప్పారు. హైద్రాబాద్, ఫిలిప్పైన్స్ లోని సొంత స్టూడియోలో 300 మంది నిపుణులతో 2 సంవత్సరాల పాటు నిర్విరామంగా కృషి చేసి ఈ దృశ్యకావాన్ని 2డి యానిమేషన్ చిత్రంగా రూపొందించామని అన్నారు. 25 కోట్ల రూపాయలతో మూడేళ్లు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ చిత్రం నిర్మించామన్నారు. ఇండియన్ యానిమేషన్ ఇండస్ట్రీలోనే ఇదో ల్యాండ్ మార్క్ అవుతుందనీ, ఇండియన్ యానిమేషన్ ని ఇంటర్నేషనల్ మార్కెట్ స్థాయికి తీసుకువెళ్లి గర్వించదగిన చిత్రంగా నిలుస్తుందనే గట్టి నమ్మకం తమకుందనీ అన్నారు. శ్రీరాముడిలోని శౌర్యం, సీతలోని సహనానికి ప్రతీకలుగా భక్తకోటి హృదయాల్లో లవకుశలు శాశ్వత స్థానం సంపాదించుకున్నారనీ, సీత కన్నీటికి కారణమైన శ్రీరామచంద్రుడిని లవకుశులు అత్యంత ధైర్యసాహసాలతో ఎదురించి నిలిచారని అన్నారు. ఆ ఘట్టంతోనే దృశ్యకావ్యంగా ఈ చిత్రం ఉంటుందన్నారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో చిత్రాన్ని రూపొందిస్తున్నామనీ, తమిళ, ఒరియా, బెంగాలి భాషల్లోకి అనువదించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనీ చెప్పారు. ప్రస్తుతం రీరికార్డింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, నవంబర్ లో ఆడియో, డిసెంబర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు తెస్తామనీ చెప్పారు. ఈ చిత్రానికి ఆర్ విఎంఎల్ యానిమేషన్ కథ, కాన్పెస్ట్ , స్క్రీన్ ప్లే అందించగా, దవళ సత్యం దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. తెలుగు వెర్షన్ కు స్వామి సత్యానంద, హిందీలో ధర్మేష్ తివారి, ఆంగ్లంలో డాక్టర్ ఎమ్.వి.ఆర్.రఘునాథరావు సంభాషణలు అందించారు. తెలుగులో వేటూరి, హిందీలో కిరణ్ మిశ్రా, ధర్మేష్ తివారి సాహిత్యం అందిస్తున్నారు. ఏసుదాసు, సాధనా సర్గమ్, శంకర్ మహదేవన్, చిత్ర నేపథ్యగానం అందించగా, ఎల్.వైధ్యనాథన్ సంగీతం సమకూర్చారు.
Be first to comment on this News / Article!
|