'బాణం' దర్శకుడి 'బసంతి'
రొటీన్ చిత్రాలకు భిన్నంగా తీయగలిగితే ఆలస్యంగా అయినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి గతంలో పలు ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా నారా రోహిత్ ను కథానాయకుడుగా పరిచయం చేస్తూ శేషు ప్రియాంక చలసాని తొలిసారి నిర్మించిన 'బాణం' చిత్రం సైతం ఇదే కోవలో క్రమంగా ప్రేక్షకాదరణకు దగ్గరవుతోంది. ఈ చిత్రం ద్వారా చైతన్య దంతులూరి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రం ఓ డ్యాక్యుమెంటరీని తలపిస్తోందనే అభిప్రాయం వినిపిస్తున్నప్పటికీ దర్శకుడు ఎలాంటి అర్భాటాలకు పోకుండా కథను నడిపిన తీరు, హీరో పాత్రను మలిచిన తీరు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఉండటంతో మెల్లమెల్లగా ప్రేక్షకాదరణ పెరుగుతోంది. తొలిచిత్రానికి లభిస్తున్న ప్రశంసలు, ఆదరణతో చైతన్య దంతులూరిలో నూతనోత్సాహం తొంగిచూస్తోంది. ఇప్పుడు ఆయన తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. 'బసంతి' అనే టైటిల్ తో ఈ కొత్తచిత్రం ఉండబోతోందని సమాచారం.
చైతన్య దంతులూరి తొలి చిత్రం 'బసంతి' కావలసి ఉంది. స్క్రిప్టు రెడీ చేసుకుని నిఖిల్ హీరోగా సినిమా ప్రారంభించాలని ఆయన ప్లాన్ చేసుకున్నారు. కారణాంతరాల వల్ల ఆ ప్రాజెక్ట ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో 'బాణం' చెతన్య తొలిచిత్రమైంది. ఇప్పుడు ఆయన 'బసంతి' ప్రాజెక్ట్ కు కసరత్తు చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు హీరోగా పరిచయమవుతారనీ, ఈ చిత్రంతో మణిశర్మ నిర్మాతగా కూడా మారి సొంతంగా నిర్మిస్తారనీ తెలుస్తోంది. అయితే అధికారికంగా ఈ వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
Be first to comment on this News / Article!
|