నాగార్జున 'పయనం'
'కింగ్' తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న యువసామ్రాట్ నాగార్జున ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. స్నేహం విలువను చాటిచెప్పే ఇతివృత్తంతో దర్శకుడు కిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగార్జున సరసన మమతా మోహన్ దాస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ నెలాఖరుకు పూర్తి చేసి డిసెంబర్ రిలీజ్ కు రెడీ చేయనున్నారు. ఈ చిత్రం తర్వాత నాగార్జున నటించనున్న చిత్రం కూడా దాదాపు ఖరారైంది. రాధామోహన్ ('ఆకాశమంత' ఫేమ్) దర్శకత్వంలో నటుడు ప్రకాష్ రాజ్ డ్యూయట్ ఫిలిమ్స్, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
దిల్ రాజు, ప్రకాష్ రాజ్ లకు ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఇటీవలే 'ఆకాశమంత' చిత్రాన్ని తమిళంలో ప్రకాష్ రాజ్ నిర్మించి రిలీజ్ చేయగా, తెలుగు వెర్షన్ కు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఆ చిత్ర దర్శకుడు రాధామోహన్ చెప్పిన కథ ఇప్పుడు నాగార్జునకు కూడా నచ్చడంతో దీనిని ద్విభాషా చిత్రంగా రూపొందించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. నాగార్జున తమిళ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. అప్పట్లో తమిళ 'రక్షకన్'లో నాగార్జున నటించారు. అంతకుముందు మణిరత్నం తీసిన 'ఇదయతై తిరుడాదే' ('గీతాంజలి' రీమేక్) కూడా తమిళంలో విడుదలైంది. నాగార్జున-రాధామోహన్ కాంబినేషన్ చిత్రానికి 'పయనం' అనే టైటిల్ అనుకుంటున్నారు. నవంబర్ లో సెట్స్ పైకి రానున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు.
Be first to comment on this News / Article!
|