మోహన్ బాబు VS షాట్ గన్
నటరత్న ఎన్టీఆర్ తన ఆరాధ్య దైవమని డాక్టర్ ఎం.మోహన్ బాబు తరచు చెబుతుంటారు. తన తండ్రి, గురువు డాక్టర్ దాసరి అయితే, మహానటుడు ఎన్టీఆర్ నుంచి తాను క్రమశిక్షణ నేర్చుకున్నానని ఆయన అంటారు. ఎన్టీఆర్ పట్ల తనకున్న వీరాభిమానం చాటుకుంటూ 'మేజర్ చంద్రకాంత్' చిత్రాన్ని లక్ష్మీప్రసన్న బ్యానర్ పై గతంలో మోహన్ బాబు నిర్మించారు. అందులో ఎన్టీఆర్ తనయుడిగా కీలక పాత్రను సైతం పోషించారు. లక్ష్మీప్రసన్న బ్యానర్ విలువను ఈ చిత్రం పెంచింది కూడా. నటన నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టారు. తాజాగా ఎన్టీఆర్ పాత్రలో డాక్టర్ మోహన్ బాబు నటించబోతున్నారని విశ్వసనీయ సమాచారం.
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు, హిందీ బాషల్లో 'రక్తచరిత్ర' అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రిప్టు కూడా రెడీ చేశారు. పరిటాల రవి జీవత కథతో ఈ చిత్రం ఉండబోతోంది. పరిటాల రవి పాత్రలో వివేక్ ఒబెరాయ్, మద్దెల చెరువు సూరి పాత్రలో తమిళ హీరో సూర్యను ఇప్పటికే ఎంపిక చేసిన వర్మ తాజాగా ఎన్టీఆర్ పాత్ర కోసం హిందీలో షాట్ గన్ శతృఘ్నసిన్హాను ఎంపిక చేశారు. పరిటాల రవి పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ సాధించి ఎన్నికల్లో గెలుపొందారు. ఆ పార్ట్ ను కూడా ఈ చిత్రంలో వర్మ చిత్రీకరించబోతున్నారు. ఎన్టీఆర్ పేరు ప్రతిష్ఠలకు తగ్గట్టుగా నటించేందుకు శత్రుఘ్న సిన్హా మాత్రమే సరిపోతాడనీ, అందుకే ఆయనను ఎంపిక చేశామనీ వర్మ ధ్రువీకరించారు. ఇదే పాత్ర తెలుగు వెర్షన్ కోసం డాక్టర్ మోహన్ బాబును వర్మ ఎంపిక చేశారు. రెండు భాగాలుగా 'రక్తచరిత్ర' ఉండబోతోంది. ఈ నెలాఖరులోనే హైద్రాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది.
Be first to comment on this News / Article!
|