ఈ మధ్యనే బెంగుళూరుకు చెందిన ఓ దురభిమాని ప్రేమిస్తున్నానంటూ స్నేహను వేధించి పోలీసుల ట్రాప్ లో చిక్కడంతో కటకటాలు లెక్కపెడుతున్నాడు. తాజాగా స్నేహ మరో వివాదంలోకి చిక్కుకుంది. తారలు బయట కనిపిస్తే వారిని చూడాలని ఆరాటపడే అభిమానులు ఒక్కోసారి శృతిమించి అక్కడక్కడా తాకాలని కూడా తహతహలాడుతుంటారు. తిరుచ్చి లో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి రెండ్రోజుల క్రితం హాజరైన స్నేహ ఇలాంటి అనుభవాన్నే చవిచూసింది. స్నేహను చూడ్డానికి పెద్ద సంఖ్యలో గుమిగూడిన అభిమానుల్లో ఒకరు ఆమెను వెనుక వైపు నించి గిల్లడంతో స్నేహ గట్టిగా అరిచిందట. దాంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బందికి నీలిరంగు చొక్కా వేసుకున్న వ్యక్తే ఈ దుందుడుకు చర్యకు పాల్పడినట్టు ఆమె ఫిర్యాదు చేయడంతో వారు సురేష్ కుమార్ అనే యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం బెయిల్ పై అతను బయటకు వచ్చాడు. సరిగ్గా అక్కడే ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తన భర్త సురేష్ అమాయకుండంటూ అతని భార్య మీడియోకు ఎక్కింది.
సంఘటన జరిగిందని చెబుతున్న సమయంలో తన భర్త సురేష్ తన దగ్గరే ఉన్నాడనీ, అసలు స్నేహ దగ్గరకు అతను వెళ్లనే లేదని అతని భార్య షర్మిల స్పష్టం చేసింది. తన భర్తపై దారుణమైన అభియోగాలకు పాల్పడినందున స్నేహపై పరువు నష్టం కేసు వేయబోతున్నట్టు తెలిపింది. ప్రారంభోత్సవాలు పేరిట బోలెడంత డబ్బులు దండుకున్న తారలు తమకు అలాంటి ఇమేజ్ ను ఇచ్చిన అమాయక ప్రేక్షకాభిమానుల పట్ల దురుసుగా వ్యవహరిస్తుండటం సముచితం కాదని ఆమె వాపోయింది. దీనిపై స్నేహ ఇంతవరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ షర్మిల మాత్రం అమీతుమీ తేల్చుకోవాలనే గట్టి పట్టుదలతో ఉంది. ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.