'కింగ్' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత మళ్లీ నాగార్జున కథానాయకుడుగా కొత్త చిత్రానికి కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ ఇటీవలే ప్రారంభించారు. ఈ చిత్రానికి 'రమ్మీ' అనే టైటిల్ దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా కిరణ్ దర్శకుడుగా పరిచయమవుతున్నారు. నాగార్జునకు జోడిగా మమతా మోహన్ దాస్ నటిస్తోంది. ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. ఇందులో భాగంగా గోవాలో నెలరోజుల భారీ షెడ్యూల్ ప్లానింగ్ జరుగుతోంది.
నాగార్జున తొలిసారి ఈ చిత్రంలో పేకాటలో మతలబులు చేసే రమ్మీ స్పెషలిస్ట్ గా కనిపించబోతున్నారు. ఇందుకు తగినట్టుగానే సినిమాకి రమ్మీ అనే టైటిల్ అనుకుంటున్నారు. స్నేహం విలువలను చాటిచెప్పే ఇతివృత్తంగా ఈ చిత్రం ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇందులో నాగార్జున పాత్రలో కొత్తదనం ఉంటుందనీ, అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రం ఉంటుందనీ శ్యాంప్రసాద్ రెడ్డి చెబుతున్నారు. నాగార్జున ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 20 వరకూ జరిగే నాన్ స్టాప్ షెడ్యూల్ తో సినిమా పూర్తి కానుంది. నాగార్జున లక్కీ సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు శివప్రసాద్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం అన్నపూర్ణా స్టూడియోస్ సమర్పణలో రూపొందుతోంది.