'ఫ్రెష్' పాటల రికార్డింగ్
జయ విజయ ఫిలిమ్స్ పతాకంపై ఎస్.రాజశేఖర్, జగదీష్ సంయుక్తంగా 'ఫ్రెష్' అనే కొత్త చిత్రానికి పాటల రికార్డింగ్ తో శ్రీకారం చుట్టారు. జగదీష్ సత్య దర్శకుడు. ఈ చిత్రం పాటల రికార్డింగ్ కార్యక్రమం మంగళవారం ఉదయం 11 గంటలకు హైద్రాబాద్ లోని ఆర్.పి.పట్నాయక్ స్టూడియోలో ప్రారంభమైంది. తమ్మారెడ్డి భరద్వాజ, వి.ఈశ్వర్ రెడ్డి, ముత్యాల సత్య కుమార్, ఆర్.పి.పట్నాయక్, కొమ్మనాపల్లి గణపతిరావు, లక్ష్మణ్ ఏలే, గోపి తదితరులు పాల్గొన్నారు. ఆర్.పి.పట్నాయక్ ఆలపించిన ఓ శ్లోకాన్ని ఈ సందర్భంగా రికార్డ్ చేశారు.
చిత్ర సంగీత దర్శకుడు అజయ్ పట్నాయక్ మాట్లాడుతూ, జగదీష్ చెప్పిన కథ చాలా బాగుందనీ, 'చిత్రం' సినిమా ద్వారా ఆర్.పి.పట్నాయక్ ను ఆదరించినట్టే ఈ సినిమా ద్వారా తనను కూడా ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాననీ అన్నారు. దర్శకుడు సత్య మాట్లాడుతూ, ఉషా కిరణ్ మూవీస్ లో రచయితగా డైరెక్టర్ వెంకి వద్ద పనిచేశానని తెలిపారు. దర్శకుడిగా తనకిది తొలి చిత్రమని అన్నారు. పుట్టుకకు ఫ్రెష్-ప్రేమకి ఫ్రెష్-జీవితానికి ఫ్రెష్ అనే కాన్సెప్ట్ తో కథ తయారు చేసుకున్నట్టు చెప్పారు. ఇందులో నూతన కథానాయకులు నటిస్తారని తెలిపారు. నిర్మాతల్లో ఒకరైన రాజశేఖర్ మాట్లాడుతూ, టైటిల్ కు తగ్గట్టే సినిమా కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుందన్నారు. ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు, కొత్త సంగీత దర్శకుడు, కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నామని అన్నారు. నవంబర్ రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి 2010 మార్చిలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. కథ-స్క్రీన్ ప్లే సైతం జగదీష్ సత్య అందిస్తున్న ఈ చిత్రానికి కొమ్మనాపల్లి గణపతిరావు మాటలు, పి.జి.విందా సినిమాటోగ్రఫీ అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|