గోపీచంద్ వెళ్లి రవితేజ వచ్చే...
లేటుగా వచ్చినా లేటెస్ట్ గా మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్న యాక్షన్ హీరోలుగా రవితేజ, గోపీచంద్ ను చెప్పుకోవచ్చు. గోపీచంద్ పక్కా యాక్షన్ చిత్రాలతో మాస్ హీరో ముద్ర వేయించుకుంటే, రవితేజ యాక్షన్ తో కూడిన ఎంటర్ టైన్ మెంట్స్ అందించడంలో దిట్ట. ఆసక్తికరంగా ఇప్పుడు గోపీచంద్ తో అనుకున్న సినిమా రవితేజ ఎగరేసుకుపోయారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాత వెంకట్ నిర్మించతలబెట్టిన తాజా చిత్రంలో రవితేజ హీరోగా వచ్చిచేశారు. రవితేజతో ఈ సంస్థ ఇటీవలనే 'కిక్' వంటి హిట్ చిత్రాన్ని అందించింది. తదుపరి చిత్రాన్ని గోపీచంద్ తో ఆ సంస్థ అనౌన్స్ చేసింది. అనుష్క హీరోయిన్ గా గోపీచంద్ మలినేనిని ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ను తనతో చెప్పకుండా అనౌన్స్ చేయడంతో గోపిచంద్ అలిగి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. దీంతో రవితేజ ఆ ప్రాజెక్ట్ లో వచ్చిచేశారు. అనుష్క, గోపీచంద్ మలినేని యథాప్రకారం ఈ ప్రాజెక్ట్ లో ఉంటారు. అక్టోబర్ నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇక్కడో ఆసక్తికరమైన ముచ్చట ఉంది. రవితేజతో అనుష్కకు ఇది మూడో చిత్రం. గతంలో 'విక్రమార్కుడు', 'బలాదూర్' చిత్రాల్లో ఈ ఇద్దరూ కలిసి నటించారు. గోపీచంద్ ఈ ప్రాజెక్ట్ ను దక్కించుకుని ఉంటే అనుష్కతో ఆయనకు కూడా మూడో చిత్రం అయుండేదే. గతంలో ఈ జంట 'లక్ష్యం', 'శౌర్యం' చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం గోపీచంద్ దర్శకనిర్మాత పూరీ జగన్నాథ్ 'గోలీమార్' చిత్రానికి రెడీ అవుతున్నారు. రవితేజ 'నాడోడిగళ్' తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ చిత్రం, వంశీ 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' చిత్రాలు కూడా రవితేజ చేయాల్సి ఉంది.
Be first to comment on this News / Article!
|