'రెచ్చిపో' చిత్రంపై దుష్ప్రచారం
నితిన్, ఇలియానా తొలిసారి జంటగా నటించిన 'రెచ్చిపో' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకూ దగ్గరవుతోందనీ, అయితే కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారనీ చిత్ర దర్శకుడు పరుచూరి మురళి వాపోతున్నారు. 'నీస్నేహం', 'పెదబాబు', 'ఆంధ్రుడు' చిత్రాలతో తన ప్రతిభను చాటుకున్న పరుచూరి మురళి రెండేళ్ల గ్యాప్ తర్వాత పూర్తి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా 'రెచ్చిపో' చిత్రాన్ని ఇటీవల ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అయితే తొలిరోజే కొందరు నెగెటివ్ ప్రచారం చేపట్టడం తనను బాధిస్తోందని ఆయన తెలిపారు.
'సినిమాకి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు తాను ఖర్చుపెట్టిన సొమ్ముకు మించిన వినోదాన్ని పొందుతున్నాడు. అన్ని చోట్ల నుంచి ఇలాంటి స్పందనే వస్తోంది. నిర్మాత జీవి రమణతో పాటు ఎగ్జిబిటర్లంతా హ్యాపీగా ఉన్నారు. మంచి కలెక్షన్లు వస్తున్నాయని ఎగ్జిబిటర్లు ఫోన్లు చేసి మరీ చెబుతున్నారు. సూపర్ హిట్ ఖాయమంటున్నారు. అయితే కొందరు గిట్టనివారెవరో సినిమాపై అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారు. సినిమా నిడివి 2.15 గంటలైతే 3 గంటలంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియదు. మా యూనిట్ అంతా ఎంతో కష్టపడి, సక్సెస్ కసితో చేసిన చిత్రమిది. నితిన్ ఎంతో కష్టపడి ఈ చిత్రం చేశాడు. అలాగే ఇలియానా కేవలం గ్లామర్ పరంగానే కాకుండా నటన పరంగా కూడా ఆకట్టుకుంటోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను పాటలు ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే ప్లాటినం డిస్క్ కూడా జరపబోతున్నాం' అని పరుచూరి మురళి తెలిపారు. టైటిల్ లో 'రెచ్చిపో' అని ఉన్నా సకుటుంబ సమేతంగా చూడదగిన చిత్రమిదనీ, ఇంతవరకూ తాను తీసిన సినిమాల్లోనే ది బెస్ట్ ఫిల్మ్ అవుతుందనీ ఆయన అన్నారు.
Be first to comment on this News / Article!
|