వర్మ 'రక్తచరిత్ర'లో ఆది
పరిటాల రవి నిజజీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు, హిందీ భాషల్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్న 'రక్త చరిత్ర' ఇంకా సెట్స్ కు రాకుండానే సంచలనాలకు కేంద్రబిందువు అవుతోంది. తాజాగా పరిటాల రవి పాత్రను పోషించే అరుదైన అవకాశం నటుడు ఆదిని వరించింది. ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడైన ఆది (ప్రదీప్ పినిశెట్టి) ఇటీవల 'మృగం' చిత్రం ద్వారా అరుదైన ప్రశంసలు అందుకున్నారు. శంకర్ ఇటీవల తమిళంలో నిర్మించిన 'ఈరం' చిత్రంలోనూ ఆది నటించారు. అనూహ్యంగా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ నుంచి ఆదికి పిలుపు వచ్చింది. అది కూడా లీడ్ రోల్ కావడం విశేషం. అంటే పరిటాల రవి పాత్రను ఆది పోషిస్తారు.
హిందీ వెర్షన్ లో పరిటాల రవి పాత్రకు ఇప్పటికే వివేక్ ఒబెరాయ్, సూరి పాత్రకు తమిళ హీరో సూర్య ఎంపికయ్యారు. తెలుగు వెర్షన్ లో పరిటాల పాత్రను ఆది, సూరి పాత్రను సూర్య పోషిస్తారు. పరిటాల రవి అప్పట్లో ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ నుంచి టిక్కెట్ పొంది గెలుపొందారు. ఎన్టీఆర్ పాత్రను హిందీలో శత్రుఘ్నసిన్హా పోషించనున్నారు. తెలుగు వెర్షన్ లో డాక్టర్ ఎం.మోహన్ బాబు ఆ పాత్రను పోషిస్తారు. మొత్తం నాలుగున్నర గంటల నిడివితో రెండు భాగాలుగా 'రక్తచరిత్ర'ను వర్మ తెరకెక్కించబోతున్నారు. అక్టోబర్ 10న హైద్రాబాద్ లో షూటింగ్ ప్రారంభం కానుంది. రాయలసీమ ఏరియాల్లో ఎక్కువ భాగం షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|