'మహాత్మ' రిలీజ్ వాయిదా
శ్రీకాంత్ 100వ చిత్రంగా కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన 'మహాత్మ' చిత్రం అక్టోబర్ 9వ తేదీకి వాయిదా పడింది. తొలుత ఈ చిత్రాన్ని గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ ఇప్పుడు మరో వారం రోజులు వాయిదా పడింది. విజయదశమి రోజున ఈ చిత్రం సెన్సార్ కు వెళ్లింది. సెన్సార్ సభ్యులు కొన్ని కట్స్ ప్రపోజ్ చేశారు. ప్రస్తుతం రివైజింగ్ కమిటీ ముందు ఈ చిత్రం ఉంది. రివైజింగ్ కమిటీ ముందు చిత్రం ప్రదర్శించడానికి, సర్టిఫికెట్ క్లియరెన్స్ కు మరింత వ్యవధి పడుతుందని భావించిన నిర్మాత సి.ఆర్.మనోహర్ సినిమా విడుదల తేదీని 9వ తేదీకి వాయిదా వేశారు.
హింసతో ఏదైనా సాధించవచ్చని భావించే దాస్ అనే యువకుడు మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు ప్రభావితుడై అహింసా మార్గంలోకి అడుగుపెట్టే కథాంశంతో 'మహాత్మ' రూపొందింది. శ్రీకాంత్ కథానాయకుడుగా, భావన హీరోయిన్ గా నటించింది. పరుచూరి సోదరులు రచన చేసిన ఈ చిత్రానికి విజయ్ ఆంటోని సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియో మహాత్మాగాంధీ మునిమనువడు తుషార్ గాంధీ చేతుల మీదుగా ఇటీవలే విడుదలైంది. గీతా ఆర్ట్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఈ చిత్రం విడుదల కానుంది.
Be first to comment on this News / Article!
|