చిత్రపురి కాలనీకి శంకుస్థాపన
సినీ కార్మికుల చిరకాలస్వప్నం ఫలించబోతోంది. హైద్రాబాద్ లోని చిత్రపురి కాలనీలో ఇళ్లు నిర్మించుకునేందుకు ముఖ్యమంత్రి రోశయ్య బుధవారంనాడు శంకుస్థాపన చేశారు. కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందనీ, అవసరమైన సాయం చేస్తామనీ రోశయ్య ఈ సందర్భంగా సినీ కార్మికులకు హామీ ఇచ్చారు.
సుమారు 15 ఏళ్ల క్రితం ప్రభాకర్ రెడ్డి చొరవతో చిత్రపురి కాలనీ నిర్మాణానికి బీజం పడింది. ఆ తర్వాత పలు దశలు దాటి శంకుస్థాపనకు సన్నద్ధమైంది. 67 ఎకరాల్లో చిత్రపురి కాలనీ నిర్మాణం జరుగనుంది. కొద్దికాలం క్రితమే ఈ కాలనీని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేతులమీదుగా శంకుస్థాపన జరిపించాలని అనుకున్నప్పటికీ ఎన్నికల కారణంగా సాధ్యపడలేదు. అనంతరం విమాన ప్రమాదంలో వై.ఎస్. కన్నుమూశారు. పరిశ్రమకు చెందిన 24 శాఖల నటీనటులు, టెక్నిషియన్లకు ఇందులో ఇళ్లు ఏర్పాట్లు చేస్తామని సొసైటీ తెలిపింది. దర్శకరత్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ, చిత్రపురి కాలనీ వాసుల కలలు ఫలించబోతున్నాయనీ, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా చిత్రపురి కాలనీలో ఇళ్లు కట్టుకునే వారికి సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి గీతారెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధతో పాటు వివిధ శాఖలకు చెందిన సినీ కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|