పద్మనాభానికి సన్మానం
సీనియర్ హాస్యనటుడు, నిర్మాత పద్మనాభంను తెలుగు చిత్ర పరిశ్రమలోని కమెడియన్స్ ఘనంగా సత్కరించారు. ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలి హాలులో బుధవారం సాయంత్రం ఈ కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. డాక్టర్ బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ఏవీయస్, రావికొండలరావు, ఎమ్మెస్ నారాయణ, ఆలీ, రాళ్లపల్లి, శ్రీనివాసరెడ్డి, చిట్టిబాబు, అనంత్, ఆలీ, సుబ్బరాయశర్మ, ఉత్తేజ్, సుత్తివేలు, గుండు హనుమంతరావు, గౌతంరాజు, రమాప్రభ, గీతాంజలి, హేమ, డి.సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
వెండితెరను నవ్వుల జవ్వులతో ముంచెత్తి, నిర్మాతగా పలు చిత్రాల ద్వారా ఉత్తమాభిరుచిన చాటుకున్న పద్మనాభంను సన్మానించడం ఆనందంగా ఉందని ఆహూతులంతా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీనియర్ నటి గీతాంజలి మాట్లాడుతూ, పద్మనాభం జోడిగా తాను పలు సినిమాల్లో నటించాననీ, తమది హిట్ పెయిర్ అనీ అన్నారు. ఆ సినిమాలు ఇప్పుడు టీవీల్లో చూసి ఆనందిస్తున్నట్టు చెప్పారు. అలాంటి మంచి నటుడు, నిర్మాతను సన్మానించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. పద్మనాభంలో తన తండ్రిని చూసుకుంటున్నానని ఆలీ పేర్కొనగా, నాటి తరం ప్రముఖులను సన్మానించుకోవడం సత్సాంప్రదాయమని రావికొండలరావు అభివర్ణించారు. ఈ సందర్భంగా హాస్యనటీనుటులంతా పద్మనాభంను పుష్పమాల, మెమెంటో, శాలువాతో ఘనంగా సత్కరించారు. డి.సురేష్ బాబు 50 వేల రూపాయలు, బ్రహ్మానందం 58 వేలు, తనికెళ్ల భరణి 25 వేలు, తక్కిన కమెడియన్లు మరికొంత వేసుకుని మొత్తం 3 లక్షల రూపాయలను పద్మనాభానికి అందజేశారు. హాస్యనటుడు అనంత్ ఇక నుంచి నెలకు 3 వేల రూపాయలు పద్మనాభానికి పంపుతానని ప్రకటించారు. డాక్టర్ దాసరి నారాయణరావు సైతం నెలకు 3వేలు అందజేస్తానని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. తనకు జరిగిన సన్మానానికి పద్మనాభం సంతోషం వ్యక్తం చేస్తూ, ఇది తనకు పునర్జన్మ వంటిదనీ, 78 ఏళ్లు పైబడినా ఈరోజే పుట్టినట్టుగా ఉందనీ అన్నారు. తనకు మూడు లక్షల రూపాయలు ఇవ్వడం చాలా గొప్ప విషయమని, ఇలాంటి సత్కారం ఎన్నడూ పొందలేదనీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని పాటలు ఆలపించి అందర్నీ అలరించారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|