డిసెంబర్ లో 'ప్రవరాఖ్యుడు'
పరిణతి చెందిన ప్రేమజంట కథతో ప్రేమలోని భావోద్వేగాలను చాటిచెప్పే విధంగా 'ప్రవరాఖ్యుడు' చిత్రం తెరకెక్కుతోంది. 'పెళ్లైన కొత్తలో' తర్వాత జగపతిబాబు, ప్రియమణి కలయికలో మదన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. టాలీ టు హాలీ ఫిలిమ్స్ పతాకంపై గణేష్ ఇందుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర యూనిట్ సౌత్ ఆఫిక్రా వెళ్లి వచ్చింది.
నిర్మాత గణేష్ ఇందుకూరి మాట్లాడుతూ, చక్కటి కథ, కథనాలతో ఈ చిత్రం తెరకెక్కుతోందనీ, మదన్ దర్శకత్వ ప్రతిభ, సురేందర్ రెడ్డి ఛాయాగ్రహణం, కీరవాణి స్వరాలు ఈ చిత్రాన్ని విజయపథంపైపు నడుపుతాయని అన్నారు. ఇటీవలే దక్షిణాఫ్రికాలో 15 రోజుల పాటు షూటింగ్ జరిపామనీ, అక్కడి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సన్నివేశాలు, జగపతిబాబు-ప్రియమణి జంటపై రెండు పాటలు చిత్రీకరించామనీ,
ఇవి సినిమాకి హైలైట్ అవుతాయనీ చెప్పారు. అక్టోబర్ నెలలో వారం రోజుల పాటు ప్రధాన తారాగణంతో చిత్రీకరించనున్న సన్నివేశాలతో టాకీ పూర్తవుతుందన్నారు. మిగిలిన పాటను జగపతిబాబు, ప్రియమణి, హంసానందినిలపై త్వరలోనే చిత్రీకరిస్తామని తెలిపారు. నవంబర్ మొదటి వారంలో ఆడియో, డిసెంబర్ ప్రథమార్థంలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ఆలీ, సునీల్, ధర్మవరపు, చలపతిరావు, సివిఎల్, రాజ్యలక్ష్మి, మధుశర్మ, అనితానాథ్ తదితరులు నటిస్తున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం మదన్ అందిస్తున్న ఈ చిత్రానికి చైతన్యప్రసాద్ పాటలు, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|