'సారాయి వీర్రాజు' తమిళ ఎంట్రీ
విశాలాక్షి క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'వైట్టాట్టమ్'. అజయ్ కథానాయకుడుగా నటిస్తున్న 'సారాయి వీర్రాజు' చిత్రాన్నే తమిళంలో 'వెట్టాట్టమ్'గా విడుదల చేస్తున్నారు. హీరోగా అజయ్ తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తుండటం కూడా ఇదే తొలిసారి.మధులిక, రమ్యనంబీసన్ హీరోయిన్లు. డి.ఎస్.కణ్ణన్ దర్శకుడిగా కె.వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలోని సత్యం థియేటర్ లో మంగళవారంనాడు జరిగింది. తొలి సీడీని అభిరామనామనాథన్, కాట్రగడ్డ ప్రసాద్, కలైపులి జి శేఖరన్ కలిసి విడుదల చేశారు.
కాట్రగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ, మంచి కథ, కథనాలు, అందుకు తగ్గ పాటలతో ఈ చిత్రం రూపొందిందనీ, దక్షిణాదిన సంచలన విజయం సాధించిన 'మగధీర' చిత్రం దర్శకుడు రాజమౌళి వద్ద కణ్ణన్ పనిచేశారనీ, ఈ సినిమాను కూడా ఆయన అంతగొప్పగానే చిత్రీకరించి ఉంటారనీ అనుకుంటున్నారనీ అన్నారు. విలన్ గా నటించి కథనాయకులుగా రాణించిన వారిలో అజయ్ కూడా చేశారనీ, ఈ చిత్రంతో పాటు ఆడియో కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. ఇటీవల విడుదలవుతున్న పలు చిత్రాలు ఫెయిలవుతున్నాయనీ, వెట్టాట్టమ్ అందుకు భిన్నంగా ఉండి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ తమిళనాడు పంపిణీదారుల సంఘం అధ్యక్షుడు కలైపులి జి.శేఖరన్ అన్నారు. దర్శకుడు కణ్ణన్ మాట్లాడుతూ, తాను తిరువణ్ణామలైకి చెందిన తమిళుడననీ, తమిళులకు తెలివెక్కువని రాజమౌళి అన్నప్పుడల్లా తనకు చాలా గర్వంగా ఉండేదనీ చెప్పారు. ఈ కథ చెప్పిన వెంటనే నిర్మాత ఒప్పుకున్నందుకు ధన్యవాదాలనీ, శ్రీసాయి మంచి సంగీతం అందించారనీ, విశ్వ కెమెరా పనితీరు కూడా ఆకట్టుకుంటుందనీ చెప్పారు. రమ్య నంబీసన్ మాట్లాడుతూ, ఇందులో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించాననీ, తన కెరీర్ లో ఇదో మంచి చిత్రం అవుతుందనీ అన్నారు. ఇది తన తొలి చిత్రమనీ, అజయ్ నటన, పాటలు అన్నీ బాగున్నాయనీ మధులిక అన్నారు. సంగీత దర్శకుడు శ్రీసాయి మాట్లాడుతూ, రచయితలు, గాయకులు అందరూ చక్కగా సహకరించడంతో మంచి సంగీతం అందించే ప్రయత్నం చేశానని అన్నారు. కణ్ణన్ చాలా చక్కగా సినిమాను తెరకెక్కించారని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో అజయ్, నిర్మాత కె.వెంకటేశ్వరరావు, విశ్వ, నటి అక్ష తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|