దేవీశ్రీ హీరో అయ్యాడు...
సంగీత దర్శకులు నటులుగా మారిన సందర్భాలు అడపాదడపా కనిపిస్తూనే ఉంటాయి. ఎస్.పి.బాలసుబ్రమణ్యం, మనో, ఆర్.పి.పట్నాయక్ వంటి పలువురు నటనలోనూ తమ అదృష్టం పరీక్షించుకున్న వారే. మరికొందరు సంగీత దర్శకులు సింగర్లుగానే వెంటితెరపై కనిపించిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు సంగీత యువతరంగం దేవీశ్రీప్రసాద్ వంతు వచ్చింది. ఎప్పుడూ నవ్వుముఖంతో, చలాకీగా కనిపిస్తూ అడపాదడపా సినిమా ఫంక్షన్లలో తన గాత్రం, స్టెప్టులతో అలరించే దేవీశ్రీకి కొద్దికాలం హీరో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే సంగీతానికే తన ప్రాధాన్యమంటూ చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా ఆయన హీరో కావడానికి సుముఖత వ్యక్తం చేస్తూ తొలిసారి ముఖానికి మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఆయన హీరోగా నటించనున్న చిత్రాన్ని సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు నిర్మించబోతున్నారు. తులసీరామ్ ('మంత్ర' ఫేమ్) దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా గత మంగళవారంనాడు సుమంత్ ఆర్ట్స్ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు జరుపుకొందని సమాచారం.
ప్రేమకథా ఇతివృత్తంతో సంగీత ప్రధానంగా ఈ చిత్రం ఉంటుందనీ, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందనీ తెలుస్తోంది. 'మంత్ర' సక్సెస్ తర్వాత పట్టుదలగా తులసీరామ్ ఈ చిత్రం స్క్రిప్టు రెడీ చేసినట్టు చెబుతున్నారు. మరోవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ కథాంశంతో కోడిరామకృష్ణ దర్శకత్వంలో 'చండి' అనే భారీ చిత్రానికి కూడా ఎం.ఎస్.రాజు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఆయన కొత్త ప్రాజెక్ట్ ల వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.
Be first to comment on this News / Article!
|