'ఘటికుడు' ఆడియో రిలీజ్
సూర్య, నయనతార జంటగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు స్టాలిన్ నిర్మిస్తున్న'ఆదవన్' చిత్రం తెలుగులో 'ఘటికుడు' పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం తెలుగు హక్కులను నిర్మాత, వ్యాపారవేత్త. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్ పొందారు. సిఎన్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. హారిస్ జైరాస్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం విజయదశమినాడు రాజమండ్రిలో జరిగింది. ఆడియో సీడీని అమలాపురం ఎంపి హర్షకుమార్ ఆవిష్కరించి రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావుకి అందజేశారు.
హర్షకుమార్ మాట్లాడుతూ, సినిమా షూటింగ్ లకు తూర్పు గోదావరి జిల్లా అనువగా ఉంటుందనీ, ఇక్కడ్నించి ఎందరో పరిశ్రమలోకి అడుగుపెట్టి మంచి పొజిషన్ లో ఉన్నారనీ అన్నారు. ఇదే జిల్లాకు చెందిన చందన రమేష్ కూడా సినిమారంగంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ, వస్త్ర వ్యాపార రంగంలో ఘటికుడైన చందన రమేష్ అతి తక్కువ సమయంలోనే రాజకీయరంగంలో కూడా ఘటికుడు అనిపించుకున్నారనీ, ఇప్పుడు సినిమా రంగంలో కూడా అలా అనిపించుకుంటారనే నమ్మకం తనకుందనీ అన్నారు. చందన రమేష్ మాట్లాడుతూ, సుమారు 42 కోట్ల రూపాయల వ్యయంతో అత్యంత భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారనీ, తెలుగు అనువాద హక్కులను తమకు ఇచ్చిన స్టాలిన్ కు కృతజ్ఞతలనీ అన్నారు. హారిస్ జైరాజ్ ఈ చిత్రానికి మంచి సంగీతం అందించారని అన్నారు. తన సొంత ఊరులో ఆడియోను విడుదల చేయాలనే ఆకాంక్షతో ఇక్కడే ఫంక్షన్ జరిపామనీ, అక్టోబర్ లో సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నామనీ చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి నగర మేయర్ ఆదిరెడ్డి వీర రాఘువయ్య, రాజకీయ ప్రముఖులు గోరం్ల బుచ్చయ్య చౌదరి, గన్ని కృష్ణ, జక్కంపూడి విజయలక్ష్మి, కందుల దుర్గేష్, బొమ్మన రాజకుమార్, తుమ్మిడి రామ్ కుమార్, చిత్ర సమర్పకులు చందన నాగేశ్వర్, 'సంతోషం' పత్రిక అధినేత సురేష్ కొండేటి పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|