పుత్రుడు కలిగినప్పుడు కాకుండా పెరిగి పెద్దవాడై తన పేరు నిలబెట్టినప్పుడు ఏ తండ్రికైనా పుత్రోత్సాహం పొంగిపొర్లుతుంటుంది. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు అలాంటి పుత్రోత్సాహంతోనే మురిసిపోతున్నారు. 'చిరుత' గా పరిశ్రమలోకి అడుగుపెట్టి రెండో సినిమా 'మగధీర'తో రామ్ చరణ్ సంచలన రికార్డులు సృష్టించడం చిరంజీవిని ఆనందంలో ముంచెత్తుతోంది. 'మగధీర' చిత్రం ఇటీవల అర్ధ శతదినోత్సవం పూర్తి చేసుకుని,
రిలీజ్ సమయంలో తొలగించిన కొన్ని సన్నివేశాలను ఇప్పుడు చేర్చడంతో థియేటర్లు మరింత కళకళలాడుతున్నాడు. ఇప్పటికే 65 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం హిందీ 'గజనీ' తర్వాత అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన రెండో చిత్రంగా నిలిచింది.
'మగధీర' చిత్రానికి రామ్ చరణ్ పడిన కష్టాన్ని మెచ్చుకుంటూ తండ్రిగా ఓ ప్రత్యేక గిఫ్ట్ ఇవ్వాలనుకున్న చిరంజీవి ఇటీవల నిశ్చయించుకున్నారు. చరణ్ కు కార్లంటే తగని ఇష్టం. అందుకు తగ్గట్టే ఓ ఖరీదైన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్.వి.యు.) కోసం చిరంజీవి ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు ఆ కారు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా అని రామ్ చరణ్ అలియాస్ చెర్రీ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.