'బెండు అప్పారావు' ట్రైలర్స్
అల్లరి నరేష్, కామ్న జెఠ్మలాని, మేఘన హీరోహీరోయిన్లుగా శ్రీసురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మిస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ 'బెండు అప్పారావు ఆర్ఎంపి'. ఇవివి సత్యనారాయణ దర్శకుడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈనెల 4వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో సినిమా ట్రైలర్స్ ను విడుదల చేస్తున్నట్టు డి.రామానాయుడు తెలిపారు.
తెలుగుదనం ఉట్టిపడే సినిమా ఇదనీ, షడ్రుచుల సమ్మేళనమనీ ఆయన తెలిపారు. హాయిగా నవ్వుకునే విధంగా అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఈ చిత్రం అలరిస్తుందని చెప్పారు. రెండ్రోజుల్లో తొలి కాపీ వస్తుందనీ, అక్టోబర్ ద్వితీయార్థంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామనీ చెప్పారు. గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన హాస్య చిత్రమిదని ఇవివి సత్యనారాయణ తెలిపారు. గ్రామీణ ప్రజల మధ్య ఉండే సరదాలు, సరసాలు, ఎమోషన్స్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయనీ, ఓ గ్రామంలో ఆర్ఎంపిగా ఉంటూ మందులకు లొంగని రోగాలను కూడా తన నవ్వుతూ మాయం చేసే చలాకీ డాక్టర్ కథే ఈ చిత్రమని అన్నారు. సహజమైన పాత్రలు, సన్నివేశాలు ఉన్న ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. ఈ చిత్రం 'అహనా పెళ్లంట'ను మించే స్థాయిలో ఉంటుందని అల్లరి నరేష్ పేర్కొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఆహుతి ప్రసాద్, ధర్మవరపు, చలపతిరావు, ఎల్బీ శ్రీరామ్, కొండవలస, శ్రీనివాసరెడ్డి తదితరులు నటించారు. వెలిగొండ శ్రీనివాస్ మాటలు, వి.జయరాం సినిమాటోగ్రఫీ, కోటి సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|