తమన్నాకు ఎర్త్ షాక్!
సినిమా షూటింగ్ లు విదేశాల్లో జరగడం వల్ల కొత్త ప్రదేశాలను చూసి ఎంజాయ్ చేసే అవకాశం తారలకు దొరుకుతుంది. ఏడాది పొడవునా షూటింగ్స్ లో పాల్గొన్నే తారలు విదేశాల్లో షూటింగ్ ల పేరిట కొంత రిఫ్రెష్ అవుతుంటారు. కొందరికి ఆయా ప్రదేశాల్లో సంచరించడం తీపి జ్ఞాపకాలను మిగిలుస్తుంది. అయితే కొందరికి మాత్రం ప్రకృతి వైపరీత్యాల వల్లనో, ఊహించని పరిస్థితులు ఎదురవడం వల్లనో చేదు అనుభవాలు కూడా అడపాదడపా తప్పవు. 'హ్యాపీ డేస్' బ్యూటీ తమన్నా ఇటీవల అలాంటి చేదు అనుభవాన్నే కౌలాలంపూర్ లో చవిచూసింది.
తెలుగు విజయవంతమైన 'కిక్' చిత్రం తమిళ రీమేక్ 'తిల్లాలంగడి' షూటింగ్ కోసం తమన్నా చిత్రయూనిట్ తో కలిసి కౌలాలంపూర్ వెళ్లింది. జయంరవి, తమన్నా తదితరులు పాల్గొన్న కొన్ని సన్నివేశాల చిత్రీకరణ అక్కడ జరుగుతోంది. ఈనెల 1వ తేదీన కౌలాలంపూర్ సమీపంలోని సుమ్రతా దీవుల్లో భూకంపం రావడంతో తమన్నా భయభ్రాంతులకు లోనైంది. అదృష్టవశాత్తూ భూకంపం సంభవించిన సమయంలో చిత్రయూనిట్ ఓ హోటల్ లో ఉంది. భూకంపం తాకిడికి హోటల్ భవనం కూడా కంపించిందట. అయితే హోటల్ కు 'ఎర్త్ క్వేక్ ప్రూఫ్' ఉందని మేనేజిమెంట్ నచ్చజెప్పడంతో యూనిట్ సభ్యులు కొంత కుదుటపడ్డారు. తమన్నా ఇప్పుడిప్పుడే ఆరోజు జరిగిన చేదు అనుభవం నుంచి కోలుకుంటోంది. చిత్రయూనిట్ సైతం సాధ్యమైనంత త్వరగా షూటింగ్ ముగించుకుని స్వదేశానికి తిరుగు ముఖం పట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.
Be first to comment on this News / Article!
|