'గ్లామర్' కోసం కరిష్మా ఫైట్
'శంకర్ దాదా జిందాబాద్' ఫేమ్ కరిష్మా కోటక్ ప్రధాన పాత్రలో జనం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నటుడు-దర్శకనిర్మాత పి.సత్యారెడ్డి రూపొందిస్తున్న చిత్రం 'గ్లామర్'. ఈ చిత్రం కోసం కరిష్మా పై కొన్ని ఫైటింగ్ సన్నివేశాల చిత్రీకరణ ఇటీవల ముంబైలో జరిగింది. చిత్రం ప్రోగ్రస్ ను సత్యారెడ్డి శుక్రవారంనాడు హైద్రాబాద్ లో తెలియజేశారు.
సినీ గ్లామర్ ప్రపంచానికి సంబంధించిన ఆకర్షణీయ కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందుతోందనీ, ఇటీవల ముంబైలో కరిష్మా కోటక్ పై ఓ పాట, ఆమెతో పాటు విలన్ గ్రూప్ పై ఫైటింగ్ సన్నివేశాలు చిత్రీకరించామని తెలిపారు. హైద్రాబాద్, నాగార్జున సాగర్ ఎత్తిపోతలు, వైజాగ్, ముంబైలో ఈ చిత్రం షూటింగ్ జరిపామన్నారు. హైద్రాబాద్ లో ప్రస్తుతం ప్యాచ్ వర్క్ సన్నివేశాలు తీస్తున్నామనీ, ఈనెల 15కు షూటింగ్ పూర్తవుతుందనీ చెప్పారు. వెంటనే నిర్మాణాంతర పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 'శంకర్ దాదా జిందాబాద్' తర్వాత తెలుగులో చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ కథలు నచ్చక తిరస్కరించాననీ, ఈ చిత్ర కథ తనకు బాగా నచ్చిందనీ కరిష్మా కోటక్ తెలిపారు. ఇందులో హీరోయిన్ తో పాటు మోడల్స్ చేసే ఫ్యాషన్ షోలు హైలైట్ గా నిలుస్తాయని చిత్ర సమర్పకుడు ఎస్.కె.రెడ్డి తెలిపారు. ఇందులోని ఐదు పాటలు ఎంతగానో అలరిస్తాయని సంగీత దర్శకుడు బాంబే రవికుమార్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఫరాఖాన్, భువనేశ్వరి, కవిత, తెలంగాణ శకుంతల, ధర్మవరపు, బాంబే రవి, జీవా, రామిరెడ్డి, కొండవలసతో పాటు ఓ ప్రముఖ హీరో, ఓ ప్రముఖ నిర్మాత నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం సత్యారెడ్డి అందిస్తుండగా, శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ, పవర్ భరత్ ఫైట్స్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|