అనుష్కకూ ఓ గుడి
దక్షిణాది తారలను చూసి బాలీవుడ్ నటీనటులంతా ఓ విషయంలో కుళ్లుకుంటారు. సినిమాలు, తారలంటే దక్షిణాది ప్రేక్షక జనం నీరాజనాలు పట్టేస్తుంటారు. బోలెడన్న అభిమాన సంఘాలు పెట్టేస్తుంటారు. భారీ కటౌట్లు, క్షీరాభిషేకాలు, రక్తతిలకాలు దిద్దడం వంటివి ఎన్నెన్నో. ఒక్కో హీరోకి లెక్కకు మించిన అభిమాన సంఘాలు టాలీవుడ్ లోనూ ఉన్నాయి. అయితే గుళ్లు..గోపురాలు కట్టించేంత అభిమానం మాత్రం లేదు. తమిళనాడులో ఇందురు భిన్నంగా హీరోయిన్ల పేరిట కూడా అభిమాన సంఘాలు పెట్టి, గుళ్లు కట్టించి పూజలు కూడా చేసేస్తుంటారు. ఆమధ్య కుష్బూకి గుడి కట్టించారు. ఆ తర్వాత ఆమె వివాహానికి ముందు లైంగిక సంపర్కం తప్పుకాదంటూ చేసిన వ్యాఖ్యలు కొందరి గుండెల్లో గుబులు పుట్టించాయో ఏమో కానీ ఈ గుడి పడగొట్టేశారు. బొద్దు భామ నమితకూ ఈమధ్య కొందరు గుడి కడతామన్నారు. ఇప్పుడు మన జేజమ్మ...అనుష్క వంతు వచ్చింది.
అనుష్క నటించిన 'అరుంధతి' ఈమధ్యనే తమిళంలోనూ విడుదలై మంచి విజయం సాధించింది. దీంతో ఆక్కడ ఆమెకూ అభిమానులు మొదలయ్యారు. దానికితోడు ప్రస్తుతం ఆమె స్టార్ హీరో విజయ్ తో కలిసి 'వేట్టైకారన్' చిత్రంలో నటిస్తుండటంతో ఆ క్రేజ్ మరింత పెరిగింది. అనుష్క పేరుతో ఓ అభిమానం సంఘం కూడా ప్రారంభమైంది. ఈమధ్యనే వారు అనుష్కను కలిసి ఆమెకు గుడి కట్టిస్తామన్నారట. అయితే అందుకు అనుష్క ససేమిరా అనేసిందట. ఈ విషయాన్ని అనుష్క సైతం ధ్రువీకరిస్తూ 'అభిమానుల గుండె గుడిలో తారలు ఉండొచ్చు. అంతే కానీ తారలను తీసుకు వెళ్లి గుడిలో పెట్టడం ఏమాత్రం సరికాదు. అందుకే అభిమానుల కోరికను సున్నితంగా తోసిపుచ్చాను' అని చెప్పుకొచ్చింది. అభిమానులైనా సరై నచ్చిప్పుడు నెత్తిన పెట్టుకుని..నచ్చకపోతే నెట్టిపారేస్తారనీ అనుష్క బాగానే గ్రహించినట్టుంది...
Be first to comment on this News / Article!
|