రవితేజ, కృష్ణవంశీ కాంబినేషన్ లో బెల్లంకొండ సురేష్ ఓ చిత్రాన్ని రెండు నెలల క్రితం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అయితే ఆ తర్వాత ఆ చిత్రం ఊసే లేదు. ఇతర చిత్రాల్లో రవితేజ బిజీ అయ్యారు. దాంతో రవితేజ-కృష్ణవంశీ చిత్రం ఇక ఉండకపోవచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఆ ఊహాగానాలకు కృష్ణవంశీ తాజాగా తెరదించారు. త్వరలోనే తమ కాంబినేషన్ చిత్రం ఉంటుందని ఇటీవల ప్రకటించారు.
రవితేజకు హీరోగా 'సింధూరం' చిత్రంతో సరైన బ్రేక్ ఇచ్చిన క్రెడిట్ కృష్ణవంశీకి దక్కుతుంది. ఆ తర్వాత కూడా కృష్ణవంశీ 'ఖడ్గం'లో రవితేజ నటించారు. ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ లో రానున్న చిత్రంలో రవితేజ సోలో హీరోగా నటించనున్నారు. ఇందులో శ్రీ కృష్ణదేవరాయులు వంశానికి చెందిన వారసుడుగా రవితేజ నటించబోతున్నారు. కృష్ణవంశీ తరహాలోనే ఈ చిత్రం కూడా ఓ బర్నింగ్ ప్లాబ్లం చుట్టూ అల్లుకున్న ఎంటర్ టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'మహాత్మ' చిత్రం గత వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ సైతం 'ఆంజనేయులు' చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా ఆయన సముద్రఖని దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న 'శంభో శివ శంభో' (తమిళ నాడోడిగళ్ రీమేక్)లో నటిస్తున్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించనున్న 'డాన్ శీను'కు కూడా రవితేజ కమిట్ అయ్యారు. ఈ రెండింటి తర్వాత రవితేజ-కృష్ణవంశీ కాంబినేషన్ చిత్రం సెట్స్ పైకి వస్తుంది.