'సుప్రీం'కు ఆదిత్య గుడ్ బై?
తరుణ్ కథానాయకుడుగా సుప్రీమ్ మూవీస్ పతాకంపై రాజు హర్వాణి, గోగినేని ప్రసాద్ నిర్మిస్తున్న కొత్త చిత్రం నుంచి ఆ చిత్ర దర్శకుడు వి.ఎన్.ఆదిత్య తప్పుకున్నారు. 50 శాతం షూటింగ్ పూర్తయిన తరుణంలో ఆ ప్రాజెక్ట్ నుంచి ఆదిత్య తప్పుకోవడం పరిశ్రమ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. 'మనసంతా నువ్వే', 'నేనున్నాను' వంటి హిట్ చిత్రాలను అందించిన ఆదిత్య కొద్దికాలంగా సరైన హిట్ లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 'ఆట', 'రెయిన్ బో' వంటి చిత్రాలు ఆదిత్యను నిరాశపరచాయి. దీంతో కొద్ది బ్రేక్ తీసుకున్న ఆదిత్య మళ్లీ ఓ హిట్ కొట్టాలనే పట్టుదలతో సుప్రీం మూవీస్ చిత్రాన్ని ఒప్పుకున్నారు. తొలుత ఈ చిత్రానికి రాజ్ ఆదిత్యను దర్శకుడిగా ప్రకటించారు. అయితే రాజ్ ఆదిత్య ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన ప్లేస్ లో ఆదిత్య వచ్చారు. కొద్దికాలంగా ప్రచారార్భాటాలకు దూరంగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకొంటోంది. ఇటీవల బ్యాంకాక్ లో ఓ కీలక షెడ్యూల్ కూడా జరుపుకొంది. అంతా సజావుగా జరుగుతోందని అనుకుంటున్న తరుణంలో ఆదిత్య ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగడం, ఆయన ప్లేస్ లో ముచ్చటగా మూడో దర్శకుడు ఎంట్రీ ఇవ్వడం చకచగా జరిగిపోయాయి.
పరిశ్రమలో సౌమ్యుడుగా పేరున్న ఆదిత్య ఏ కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ను సగంలో ఉండగా వదులుకున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. విశ్వసనీయ సినీ వర్గాల సమాచారం ప్రకారం...ఈ చిత్రం ప్రోగ్రస్, అనుకున్న విధంగా కథను తెరకెక్కించే విషయంలో ఆదిత్య ఆటుపోట్లు ఎదుర్కోవలసి వచ్చిందట. తాను అనుకున్న క్వాలిటీ ఇవ్వాలంటే తనకు తగినంత స్వేచ్ఛ ఉండాలనీ, రాజీ పడితే ఇప్పటికే ఒకటి రెండు ఫ్లాపులు ఇచ్చిన తనకు మరింత చెడ్డపేరు వస్తుందని ఆయన భావించారట. దీంతో ఆయన సినిమా వదులుకుంటున్నట్టు లెటర్ కూడా ఇచ్చి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని సమాచారం. ఆదిత్య తప్పుకోవడంతో ఇప్పుడు ఆ ప్లేస్ లో కన్మణి (నా ఊపిరి...చిన్నోడు చిత్రాల ఫేమ్) వచ్చిచేరారు. ఆదిత్య ప్రస్తుతం అమెరికాలో తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఎన్ఆర్ఐ నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారనీ, అక్కడి నుంచి తిరిగి రాగానే తన కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
|