టార్గెట్ చిరంజీవి అండ్ కో?
వరదల బాధితుల సహాయార్ధం 'స్టార్ నైట్' ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని ప్రకటించేందుకు మూవీ ఆర్టిస్ట్స్ అసోయేషన్ (మా) ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశం మరోసారి ఆర్టిస్టుల మధ్య ఉన్న విభేదాలను ప్రస్ఫుటం చేసిందనే ఆభిప్రాయానికి తావిచ్చింది. నాగార్జున, చిరంజీవి, ఆయన ఫ్యామిలీ హీరోలు మినహా దాదాపు టాలీవుడ్ హీరోలంతా హాజరయ్యారు. నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, మంచు వారి ఫ్యామిలీ నుంచి డాక్టర్ ఎం.మోహన్ బాబు, విష్ణువర్దన్ బాబు, ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి శ్రీమతి విజయలలిత, నరేష్ తదితరులు హాజరయ్యారు. ఎటొచ్చీ పరిశ్రమలో హీరోగా రాజకీయాల్లోకి రాకముందు వరకూ దాదాపు పాతికేళ్లు అగ్రాసనం అలంకరించిన చిరంజీవి, ఆయన ఫ్యామిలీకి చెందిన పవన్ కల్యాణ్, రామ్ చరణ్ తో పాటు యువహీరోలందరితో చక్కటి స్నేహసంబంధాలున్న అల్లు అర్జున్ హాజరుకాకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. సహజంగానే ఇది పరోక్ష, ప్రత్యక్ష అంశంగా చర్చకు కూడా దారి తీసింది.
'ఇది మన ఇంటి సమస్యగా భావించి అందర్నీ కలిసి రావాల్సిందిగా బాలయ్యబాబు చెప్పారు. అయినప్పటికీ కొందరు హాజరు కాలేదు. తెలిసి రానివాళ్లను క్షమించకూడదు' అంటూ మోహన్ బాబు ఘాటుగానే విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా చిరంజీవి అండ్ పార్టీ పైనేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. హీరో రాజశేఖర్ మరో అడుగు ముందుకు వేసి...చిరంజీవి పార్టీ మినహా ఇంచుమించు అందరూ హాజరయ్యారని నేరుగా చెప్పడం కూడా పలువురి దృష్టిని ఆకర్షించింది. గతంలో మోహన్ బాబు-చిరంజీవి, రాజశేఖర్-చిరంజీవి మధ్య చోటుచేసుకున్న మనస్పర్థలే ఈ ప్రత్యక్ష, పరోక్ష విమర్శలకు కారణమనీ, హుందాగా వ్యవహరించాల్సిన సమయంలో వ్యక్తిగతానికి చోటులేదనీ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక మంచి లక్ష్యం కోసం పరిశ్రమ అంతా ఏకతాటిగా ఉందని చాటుకునే తరుణంలో ఇలాంటి 'కొర్రీ'లు వేయడం తగదని వారు హితవు పలుకుతున్నారు. కొందరు హీరోలు షూటింగ్ వల్ల రాలేకపోతున్నామని తనకు చెప్పారనీ, వారంతా స్టార్ నైట్ కు పూర్తిగా సహకరిస్తామని మాట ఇచ్చారంటూ బాలకృష్ణ హుందాగా వ్యవహరించడం మాత్రం ప్రశంసలు అందుకుంటోంది. అన్నట్టు...చిరంజీవి వరద బాధిత ప్రాంతాల పర్యటనలో ఉండగా, నాగార్జున గోవాలో జరుగుతున్న షూటింగ్ లో ఉన్నారు.
Read 16 Comment(s) posted so far on this News / Article!
|