తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలను దిగంతాలకు చాటిన దర్శకుల్లో బాపు, కళాతపస్వి కె.విశ్వనాథ్ ప్రముఖులు. వయోభారం కారణంగా అడపాదడపా మాత్రమే ఈ ఇద్దరూ దర్శకత్వం వహిస్తున్నారు. మళ్లీ ఈ దర్శకులు మెగాఫోన్ పడితే అందులో నటించే అదృష్టం దక్కించుకోవాలని తహతహలాడని హీరోలు ఉండకపోవచ్చు. కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేకత ఏర్పరచుకున్న అల్లరి నరేష్ ఇప్పటికే బాపు చిత్రంలో నటించే అవకాశాన్ని 'సుందరాకాండ'తో దక్కించుకున్నారు. ఇప్పుడు కె.విశ్వనాథ్ దర్శకత్వంలో నటించే బంపర్ ఆఫర్ ను కూడా ఆయన దక్కించుకున్నారు.
విశ్వనాథ్ చివరి సారిగా 2004లో 'స్వరాభిషేకం' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రం కమర్షియల్ సక్సెస్ కానప్పటికీ నిర్మాత సి.కౌసలేంద్రరావు ఉత్తమాభిరుచికి అద్దం పట్టింది. ఆ తర్వాత విశ్వనాథ్ నటుడిగా పలు చిత్రాల్లో నటించినప్పటికీ దర్శకత్వం జోలికి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ విశ్వనాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయాలనే పట్టుదలతో నిర్మాత కౌసలేంద్రరావు ఆయనను ఒప్పించగలిగారు. కథా చర్చలు కూడా ముగిశాయి. ప్రస్తుతం నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. మణిశర్మ సంగీత దర్శకత్వంలో మ్యూజిక్ సిట్టింగ్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. వందకు పైగా చిత్రాలకు పనిచేసిన మణిశర్మ తొలిసారి విశ్వనాథ్ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం.