గోవాలో నాగార్జున 'రమ్మీ'
డిసెంబర్ లో రిలీజ్ టార్గెట్ గా నాగార్జున చకచగా రమ్మీ ఆడుతున్నారు. విషయం ఏమిటంటే నాగ్ నటిస్తున్న కొత్త చిత్రానికి 'రమ్మీ' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. గోవాలో గత మూడు రోజులుగా జరుగుతున్న షూటింగ్ లో నాగార్జున పాల్గొంటున్నారు. దాదాపు నెలరోజుల షెడ్యూల్ అక్కడే ఉంటుందని సమాచారం.
నాగార్జున గత ఏడాది డిసెంబర్ లో 'కింగ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ చిత్రాన్ని నిర్మించిన కామాక్షి కళా మూవీస్ సంస్థ అధినేత డి.శివప్రసాద్ రెడ్డి మళ్లీ నాగ్ తోనే 'రమ్మీ' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది. అక్కినేని వెంకటరత్నం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. నాగార్జునకు జోడిగా మమతా మోహన్ దాస్ నటిస్తోంది. నాగార్జున కేరెక్టర్ ఇందులో కొత్తరకంగా ఉంటుందనీ, వినోదంతో కూడిన పక్కా మాస్ ఎంటర్ టైనర్ ఇదనీ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ చిత్రం ద్వారా కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నాగార్జున ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని చక్కటి స్క్రిప్టుతో ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తున్నారు. నాన్ స్టాప్ గా జరిగే షూటింగ్ షెడ్యూల్ తో నవంబర్ చివరి కల్లా షూటింగ్ పూర్తయవుతుందనీ, డిసెంబర్ లో రిలీజ్ ఉంటుందనీ శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఈ చిత్రానికి సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ, సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|