'జగన్మోహిని' విడుదలపై స్టే
నమిత టైటిల్ పాత్ర పోషించగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన 'జగన్మోహిని' చిత్రం విడుదలపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది. దీపావళి కానుకగా ఈనెల 17న 'జగన్మోహిని' విడుదలకు సిద్ధమైన తరుణంలో ఈ పరిస్థితి తెలెత్తింది. ఎస్.కె.విశ్వనాథ్ దర్శకత్వంలో మురళీ సినీ ఆర్ట్స్ పతాకంపై హెచ్.మురళి ఈ ద్విభాషా చిత్రాన్ని నిర్మించారు. రాజా, మీరాచోప్రా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం విడుదలను ఆపాలంటూ చెన్నైకి చెందిన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఎ.అళగప్పన్ కోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ జి.రాజసూర్య మంగళవారంనాడు స్టే ఇచ్చారు.
నిర్మాత హెచ్.మురళి తనకు 4 లక్షలు బకాయి పడ్డారని అళగప్పన్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. తమిళంలో శ్రీకాంత్-స్నేహ హీరోహీరోయిన్లుగా మురళి గతంలో నిర్మించిన 'బోస్' చిత్రానికి తాను 40 లక్షలు చెల్లించి పంపిణీ హక్కులు తీసుకున్నాననీ, ఆ చిత్రం తనకు తీవ్రమైన నష్టాలు తెచ్చిపెట్టిందనీ ఆయన అన్నారు. ఇదే సినిమాకు అడిషనల్ సెక్యూరిటీగా తాను మరో 4 లక్షలు కూడా నిర్మాతకు ఇచ్చాననీ, ఈ ఏడాది జనవరితో ఐదేళ్ల డిస్ట్రిబ్యూటన్ పీరియడ్ ముగిసినందున తాను ఇచ్చిన 4 లక్షల రూపాయలు వడ్డీతో సహా తనకు మురళి తిరిగి ఉవ్వాల్సి ఉందని అన్నారు. 'జగన్మోహిని' రిలీజ్ కు ముందే ఆ మొత్తం చెల్లిస్తానని చెప్పిన మురళి తన మాట నిలబెట్టుకోలేదనీ, సినిమా విడుదల తేదీని కూడా హడావిడిగా ప్రకటించడంతో తాను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందనీ ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ చిత్రం విడుదలపై న్యాయమూర్తి 'స్టే' విధించి తదుపరి విచారణను 16వ తేదీ గురువారానికి వాయిదా వేశారు.
Be first to comment on this News / Article!
|