సిద్దార్ధతో శ్రుతి హాసన్?
యూత్ లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న సిద్దార్ధ ఇప్పుడు హీరోయిన్ల లక్కీ హీరోగా అనిపించుకుంటున్నారు. బాలనటిగా పాపులర్ అయిన షామిలిని హీరోయిన్ గా తొలిసారిగా 'ఓయ్' చిత్రంలో తన పక్కన నటింపజేసిన సిద్దార్ధ ఇప్పుడు మరో ముద్దుగుమ్మతో జతకట్టబోతున్నారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు. కమల్ హాసన్ ముద్దుల కూతురు శ్రుతి హాసన్. ఆమెకు కూడా తెలుగులో ఇది తొలి సినిమానే కానుంది.
'ఓయ్' చిత్రం తర్వాత సిద్దార్ధ హీరోగా కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ రావు దర్శకత్వంలో కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. రెండు నెలల క్రితమే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ ఈనెల 21 నుంచి హైద్రాబాద్ లో ప్రారంభం కానుంది. సోషియో ఫాంటసీగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కొద్దిరోజులుగా హీరోయిన్ కోసం జరిపిన అన్వేషణ శ్రుతి హాసన్ దగ్గర ఆగిందనీ, ఆ ప్రాజెక్ట్ లో నటించేందుకు ఆమె అంగీకరించిందనీ సమాచారం. 'లక్' చిత్రంతో బాలీవుడ్ లోకి ఇటీవల అడుగుపెట్టిన శ్రుతి ఈమధ్యనే కమల్ 'ఈనాడు' చిత్రానికి సంగీతం కూడా అందించారు. ఇప్పుడు హీరోయిన్ గా తెలుగులో నటిస్తుండటం సహజంగానే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి జె.కె.భారవి మాటలు, సౌందర్ రాజన్ ('బిల్లా' ఫేమ్) సినిమాటోగ్రఫీ, మిక్కీ జె.మేయర్ సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|