కట్టనా..కొట్టనా?
కృష్ణవంశీ నుంచి 'పొలిటికల్ టచ్' ఉన్న సినిమా వస్తోందంటే మార్నింగ్ షో మిస్ కాకూడదనే అభిప్రాయం సినీగోయెర్స్ లో ఉంది. ఒకటో అరో వివాదాస్పద సన్నివేశాలు ఉంటే వాటిని ఆ తర్వాత కట్ చేసే అవకాశాలుంటాయనీ, మొదట్లోనే సినిమా చూడటం వల్ల వాటిని మిస్ కాకుండా ఉండవచ్చనే అభిప్రాయం కూడా ఇందుకు ఓ కారణం. ఊహించినట్టుగానే ఇప్పుడు 'మహాత్మ' చిత్రంలోని ఓ సన్నివేశంపై భజరంగ దళ్ కార్యకర్తలు కన్నెర్ర చేశారు. 'వాలంటైన్స్ డే' (ప్రేమికుల రోజు)కు సంబంధించిన ఓ సన్నివేశాన్ని ఇందులో కృష్ణవంశీ చిత్రీకరించడమే ఇందుకు కారణం. ఇది హిందువుల మనోభావాలను దిబ్బతీసే విధంగా ఉందంటూ దళ్ కార్యకర్తలు హైద్రాబాద్ ఫిల్మ్ నగర్ లోని 'మహాత్మ' ఆఫీస్ వద్ద ధర్నాకు కూడా దిగారు. ఇరవై నాలుగు గంటల లోగా ఆ సన్నివేశాలను తొలగించి, దర్శక నిర్మాతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డెడ్ లైన్ కూడా విధించారు.
'వాలంటైన్స్ డే' హిందూ సంస్కృతి కాదనీ, ఆ రోజు అమ్మాయిలు-అబ్బాయిలు కలిసి తిరిగితే వారికి అక్కడికక్కడే వివాహం జరిపిస్తామనీ చెబుతూ ముంబైలో భజరంగ్ దళ్ కార్యకర్తలు తాళిబొట్లతో తిరిగి గత ఏడాది కలకలం సృష్టించారు. దీనిపై గట్టి చర్చే జరిగింది. ఇలాంటి ఘట్టమే కృష్ణవంశీ 'మహాత్మ' చిత్రంలో చోటుచేసుకుంది. శ్రీకాంత్ రౌడీయిజం నచ్చని అతని గాళ్ ఫ్రెండ్ భావన ఎవర్నీ కొట్టనని అతని దగ్గర మాట తీసుకుంటుంది. ఇద్దరూ బైక్ మీద వస్తుంటే దళ్ కార్యకర్తలు అడ్డుకుంటారు. శ్రీకాంత్ కు తాళిబొట్టు ఇచ్చి భావన మెడలో కట్టమంటారు. కట్టమంటావా (తాళి)...కొట్టమంటావా (కార్యకర్తలను) అని అడుగుతాడు. కొట్టమంటుంది భావన. దాంతో శ్రీకాంత్ దళ్ కార్యకర్తలపై విరుచుపడి తుపాకీ చూపడంతో వాళ్లంతా పరారవుతారు. వాస్తవ సంఘటనలకు దగ్గరగా ఈ సన్నివేశం తీయాలని కృష్ణవంశీ ఆలోచన ఇప్పుడు దళ్ కార్యకర్తల ఆగ్రహానికి కారణమవుతోంది. ఆ సన్నివేశాన్ని కృష్ణవంశీ 'కట్' చేస్తారా అనేది చూడాలి...
Read 1 Comment(s) posted so far on this News / Article!
|