నాన్ స్టాప్ 'కిలాడీ'
ప్రిన్స్ మహేష్ బాబు 'అతిథి' చిత్రం తర్వాత మళ్లీ ఇంతవరకూ ఖాతా తెరవలేదు. గత ఏడాది మహేష్ సినిమా విడుదల కాకుండానే గడిచిపోయింది. ఈ ఏడాది సైతం ఈ పరిస్థితి తప్పేలా లేదు. ఇది మహేష్ బాబు అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. మహేష్ సైతం రెండేళ్ల గ్యాప్ ను ఎక్కువగానే ఫీలవుతున్నారు. ఇక నుంచి తప్పనిసరిగా ఏడాదికి రెండు సినిమాలు ఉండేలా చూసుకుంటానని చెబుతున్న మహేష్ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం నాన్ స్టాప్ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. 'అతడు' వంటి సెన్సేషన్ హిట్ తర్వాత మహేష్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి 'కిలాడీ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మహేష్ సరసన అనుష్క కథానాయికగా నటిస్తోంది. కనకరత్న మూవీస్ పతాకంపై సింగనమల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
చిత్ర విశేషాలను సింగనమల రమేష్ తెలియజేస్తూ, మహేష్ బాబు ఇందులో ఇంతవరకూ చేయనటువంటి ఓ విలక్షణ పాత్ర పోషిస్తున్నారనీ, అందరి అంచనాలను మించే విధంగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నారనీ చెప్పారు. ఈ సోమవారం (19) నుంచి హైద్రాబాద్ లో నిరవధిక షూటింగ్ జరుపుతున్నామనీ, నెలాఖరువరకూ ఇక్కడే షూటింగ్ జరిపి నవంబర్ మొదటి వారం నుంచి రాజస్థాన్ లో నెల రోజులు షూటింగ్ కు ప్లాన్ చేశామనీ, డిసెంబర్ మొదటి వారం నుంచి వికారాబాద్ లో వేస్తున్న భారీ విలేజ్ సెట్ లో షూటింగ్ జరుపుతామనీ చెప్పారు. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం, సునీల్, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, షఫీ, సునీల్ శర్మ తదితరులు నటిస్తున్నారు. సునీల్ పటేల్ సినిమాటోగ్రఫీ, ఆనంద సాయి ఆర్ట్, శ్రీకర్ ప్రసాద్ ఎడటింగ్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|