బింధుమాధవి లక్ష విరాళం
రాష్ట్రంలో సంభవించిన వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ ప్రముఖలంతా తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని వివిధ సేవా సంస్థలు, ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తున్నాయి. కొందరు భారీ విరాళాలతో ముందుకు రాగా, మరికొందరు తమ స్థాయికి తగిన విరాళం అందిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. కేవలం ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పదహారణాల తెలుగమ్మాయి బిందు మాధవి ('ఆవకాయ్ బిర్యానీ' ఫేమ్) లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించి తన ఔదార్యాన్ని చాటుకుంది. ఆర్థిక సహాయం అందించడంతో పాటు నిధుల సేకరణకు సంబంధించి ప్రమోషన్ వర్క్ లోనూ తాను పాల్గొంటున్నాననీ, సొంత గూడు సైతం కోల్పోయిన బాధితులను ఆదుసుకునేందుకు తన సహచర హైద్రాబాద్ వాసులంతా ముందుకు రావాలని ఆమె సూచించారు.
కేవలం ఒకే సినిమాలో నటించి మరో రెండు చిత్రాలు చేతిలో ఉన్న బిందుమాధవి లక్ష రూపాయల విరాళంతో ముందుకు రాగా, టాలీవుడ్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న రాష్ట్రేతర హీరోయిన్లు మాత్రం ఇప్పటికే ఎలాంటి ఆర్థిక సహాయంతో ముందుకు రాకపోవడం పలువురి విమర్శలకు కారణమవుతోంది. లక్షలాది రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్న సదరు హీరోయిన్లు కనీసం సినిమాల ఆడియో ఫంక్షన్లలో కూడా పాల్గొనడం లేదనీ, అలాంటప్పుడు ప్రకృతి వైపరీత్యాలకు స్పందించకపోవడం పెద్ద వింతేమీ కాదనీ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలియానా, జెనీలియా, శ్రియ, ఆసిన్, చార్మి కౌర్, అనుష్క, ప్రియమణి వంటి పలువురు టాలీవుడ్ ఇంపోర్టెడ్ హీరోయిన్ల జాబితాలోకే వస్తారు.
Be first to comment on this News / Article!
|