చిరంజీవి అంటే పేద్ద హీరో
జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో రకమైన స్ట్రగుల్ ఉంటుందనీ, అయితే వాటికి వెరవకుండా నవ్వుతూనే ముందుకు సాగాలనే అంశాన్ని 'మా నాన్న చిరంజీవి' (అంటే పెద్ద హీరో) చిత్రంలో చూపించామనీ చిత్ర కథానాయకుడు జగపతిబాబు తెలిపారు. లాఫింగ్ లార్డ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. హైద్రాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో సోమవాంనాడు ఈ విశేషాలను చిత్రయూనిట్ తెలిపింది.
కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిదనీ, వినోదంతో పాటు సెంటిమెంట్ మిళితమై ఉంటుందనీ జగపతిబాబు తెలిపారు. ఇలాంటి చిత్రాలు చేయాలని తనకున్నా చేసే దర్శకులే లేరనీ, అరుణ్ ప్రసాద్ ఈ చిత్రాన్ని మలిచిన తీరు ప్రశంసనీయమనీ అన్నారు. భార్య, భర్త, పిల్లాడు మధ్య జరిగే కథ ఇదనీ, నిర్మాణపరంగానూ చక్కటి సహకారంతో షూటింగ్ సజావుగా సాగిందన్నారు. మొత్తం రెండు గంటల సినిమా ఇదని అన్నారు. ఎవరి ఇంట్లో వారికి తండ్రే హీరో అనీ, తండ్రీ కొడుకుల కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని మలిచామనీ అరుణ్ ప్రసాద్ తెలిపారు. భరణి కె ధరన్ ఫోటోగ్రఫీ, హేమ చందర్ సంగీతం, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ కామెడీ వంటివి హైలైట్స్ గా ఉంటాయనీ అన్నారు. నవంబర్ 2వ వారంలో సినిమా విడుదల ఉంటుందన్నారు. నటనకు అవకాశమున్న పాత్ర పోషించినట్టు కథానాయిక నీలిమ పేర్కొంది. ఈ తరహా చిత్రం ఇంతవరకూ రాలేదని నటుడు సత్యం రాజేష్ అన్నారు. అందరి సహకారంతో సినిమా చాలా బాగా వచ్చిందని లాఫింగ్ లార్డ్ ఎంటర్ టైన్ మెంట్స్ కు చెందిన మురళీకృష్ణ తెలిపారు. మాస్టర్ అతులిత్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాడు.
Be first to comment on this News / Article!
|