'చాప్టర్-6' ఆడియో వేడుక
నటి కల్యాణి ప్రధాన పాత్రలో ప్రేమలోని ఆరు కోణాలను ఆరు రంగులతో పోలుస్తూ చాప్టర్-6 పేరుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాల, సోనియాసూరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత నటి కల్యాణి, దర్శకుడు సూర్యకిరణ్. వీరిద్దరూ దంపతులన్న విషయం తెలిసిందే. నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియో వేడుకను హైదరాబాద్ లోని ఓ ఐదు నక్షత్రాల హోటల్ లో నిర్వహించారు. డాక్టర్ దాసరి నారాయణరావు ఆడియో సీడీని ఆవిష్కరించి విక్టరీ వెంకటేష్ కు తొలి పత్రిని అందజేశారు. డాక్టర్ రాజశేఖర్ ఆడియో క్యాసెట్ ను ఆవిష్కరించి తొలిపత్రిని హీరో జగపతి బాబుకు అందజేశారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ సూర్యకిరణ్, కల్యాణి దంపతులిద్దరికీ ఈ సినిమా తొలి బిడ్డలాంటిదన్నారు. తనతో సినిమాలు చేసిన వారినందరినీ ఆహ్వానించి, వారి సమక్షంలో ఈ ఆడియోను విడుదల చేయడం కల్యాణి మంచితత్వానికి ప్రతీకన్నారు. వారు చేస్తున్న ఈ ప్రయత్నం సఫలం కావాలని కోరుకుంటున్నానని అన్నారు.
'చాప్టర్-6' చిత్రకథ కొత్తగా ఉందనీ, ఆడియోతో పాటు సినిమా కూడా విజయంవంతం కావాలని విక్టరీ వెంకటేష్ అభిలషించారు. దర్శకుడు సూర్యకిరణ్ మాట్లాడుతూ రెగ్యులర్ ప్రేమకథా చిత్రాల్లా ఈ చిత్రం ఉండదని అన్నారు. ఒక్కో పాటను ఒక్కో సంగీత దర్శకుడు ఆలపించారని చెప్పారు. దేవిశ్రీప్రసాద్, ఆర్ పి పట్నాయక్, చక్రి, శ్రీలేఖ, జెస్సీగిఫ్ట్, పిసి శివన్, మోహన్ సితార, హరిహరన్ వంటి పాడారని ఆయన వివరించారు. కథ బాగా నచ్చినందువల్లే ఈ చిత్రం ద్వారా తాను నిర్మాతగా మారినట్లు కల్యాణి చెప్పారు. ఎస్.వి. కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, సి.కల్యాణ్, భీమనేని శ్రీనివాసరావు, జీవిత రాజశేఖర్, రాజ, శానం నాగ అశోక్ కుమార్, సుకుమార్, శ్రీలేఖ, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|