'పెళ్లి వార్తల్లో నిజం లేదు'
నటి సింధుతులానిని పెళ్లాడబోతున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని యువ దర్శకుడు సురేంద్రరెడ్డి వివరణ ఇచ్చారు.'అతనొక్కడే', 'అశోక్' 'అతిథి' చిత్రాలతో పాటు ఇటీవలే విడుదలైన విజయవంతమైన 'కిక్' చిత్రానికి సురేంద్రరెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఓ అగ్రహీరోతో కొత్త సినిమాకి కూడా రెడీ అవుతున్నారు. సింధుతులాని సైతం తమిళ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి ఇటీవల 'బతుకమ్మ' చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'అతనొక్కడే' చిత్రంలో సింధుతులాని అప్పట్లో నటించింది. ఆ చిత్రం షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందంటూ పుకార్లు షికారు చేశాయి. సురేంద్రరెడ్డి సైతం అలాంటిదేమీ లేదంటూ వివరణ ఇచ్చారు. అనూహ్యంగా రెండ్రోజుల క్రితం దర్శకుడు సురేంద్రరెడ్డిని త్వరలోనే సింధుతులాని పెళ్లాడనుందంటూ చెన్నైకి చెందిన ఓ పత్రికలో వార్తా కథనం ప్రచురితమైంది
సురేంద్రరెడ్డి మరోసారి ఈ వార్తలను ఖండిస్తూ, తాను ఇంతవరకూ సెలబ్రెటీగా ఎప్పుడూ అనుకోలేదనీ, ఇలాంటి వార్తలతో తనను సెలబ్రెటీని చేసినట్టు అనుకుంటున్నాననీ అన్నారు. 'అతనొక్కడే' సినిమలో సింధుతులాని హీరోయిన్ గా చేసిందనీ, అందరి హీరోయిన్ల తరహాలోనే ఆమె కూడా తనకు మంచి ఫ్రెండనీ వివరణ ఇచ్చారు. ఫ్రెండ్ షిప్ కే తమ అనుబంధం పరిమితమనీ, అంతకుమించి ఆ వార్తలతో తనకెలాంటి సంబంధం లేదనీ ఆయన స్పష్టం చేశారు.
Be first to comment on this News / Article!
|