బంపర్ ఆఫర్ల బిందు
తొలి సినిమా హిట్టయితే హీరోయిన్లకు బంపర్ ఆఫర్లు రావడం సహజం. అయితే తొలి సినిమా బాక్సాఫీస్ ఫలితం నిరాశపరచినా నటి బిందుమాధవికి బంపర్ ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ప్రముఖ దర్శకనిర్మాత పూరీ జగన్నాథ్ తన సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా నిర్మించిన 'బంపర్ ఆఫర్' చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పదహారణాల తెలుగమ్మాయి అయిన బిందు మాధవి ఇటీవల శేఖర్ కమ్ముల దృష్టిలో పడి 'ఆవకాయ్ బిర్యానీ' చిత్రంతో హీరోయిన్ గా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. సాంప్రదాయాలను గౌరవించే తెలుగమ్మాయిగా బిందు నటన ప్రశంసలు అందుకుంది. అయితే కేవలం పల్లెటూరి అమ్మాయి పాత్రలకే తాను పరిమితం కాదనీ, మోడలింగ్ నుంచి వచ్చిన తనకు గ్లామర్ ప్రదర్శన నల్లేరు మీద నడకేనని 'బంపర్ ఆఫర్' చిత్రంతో బిందు నిరూపించుకోనుంది. బంపర్ లెవల్లో గ్లామర్ తళుకులు దట్టించిన బిందు ఈ సినిమాపై ఎక్కువ ఆశలే పెట్టుకుంది. ఈ చిత్రం తర్వాత బిందు మాధవి అంగీకరించిన చిత్రాలు కూడా ఆమెకున్న చక్కటి కెరీర్ ప్లానింగ్ కు అద్దంపడుతున్నాయి.
'గణేష్' తర్వాత రామ్ కథానాయకుడుగా దిల్ రాజు నిర్మించనున్న 'రామ రామ కృష్ణ కృష్ణ' త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఇందులో రామ్ కు జోడిగా బిందు మాధవి నటించింది. దీనికి తోడు త్రీ ఏంజిల్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ కుమార్తె శేషు ప్రియాంక చలసాని ('బాణం' ఫేమ్) నిర్మిస్తున్న 'ఓం శాంతి' చిత్రం కూడా ప్రోగ్రస్ లో ఉంది. ఇందులో కాజల్-నవదీప్ ఒక జంట కాగా, మరో జంటగా నిఖిల్-బిందుమాధవి నటిస్తున్నారు. 'బంపర్ ఆఫర్' హిట్టయితే బిందు మాధవి నటిస్తున్న చిత్రాలకు కూడా సహజంగానే క్రేజ్ పెరుగుతుంది. తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిల కొరతను బిందు తీరుస్తుందనే ఆశిద్దాం.
Be first to comment on this News / Article!
|